ఓటు నమోదుపై ప్రజల అలసత్వం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం: ఆళ్ళ హరి

  • అర్హత ఉన్న కొత్త ఓటర్లు సైతం ఓటు నమోదుకు ఆసక్తి చూపకపోవటం దురదృష్టకరం
  • ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అధికారులు కృషిచేయాలి
  • ఓటు నమోదు ప్రక్రియకు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలి
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణానికి పునాదిలాంటి ఓటు హక్కును కలిగి ఉండటం ఈ దేశ పౌరుడిగా ప్రతీ ఒక్కరి మౌలిక హక్కు అని, అలాంటి ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రాకపోవటం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఒక్కరు కూడా కూడా నమోదు చేసుకోలేదని, కొన్ని చోట్ల ఒకరో ఇద్దరో నమోదు చేయించుకున్నారన్నారు. ఓటు నమోదు పట్ల ప్రజల్లో నెలకొన్న అలసత్వంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో ఓట్లు తొలగించారన్న వ్యాఖ్యలు వినపడుతున్న నేపథ్యంలో తమ ఓటు ఉందో లేదో అని పరిశీలించుకునేందుకు కూడా ప్రజలు సమయాన్ని కేటాయించకపోవటం దురదృష్టకమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోచుకోనివారు ప్రశ్నించే హక్కుని కోల్పోతారన్నారు. మన బ్రతుకుల్ని, ముందుతరాల వారి భవిష్యత్ ని ప్రభావితం వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ప్రతిఒక్కరూ కలిగి ఉండాలన్నారు. సమాజాన్ని మరింత ప్రభావితం చేసే యువత ఓటు హక్కుని కలిగిఉండటం ఒక బాధ్యతగా భావించి ఓటు హక్కును వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు హక్కు నమోదుపై అధి కారులు వివిధ ప్రసారమాద్యమల ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని కోరారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని కోరారు. స్వచ్చంద సంస్థలు సైతం ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. ఆదివారం జరిగే ఓటు నమోదు ప్రత్యేక డ్రైవ్ ని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని ఆళ్ళ హరి కోరారు.