ఆధార్ ఉంటేనే రేషన్

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులు తీసుకోవడానికి ఇక నుంచి ఆధార్ తప్పనిసరి కానుంది. చాలా నెలల క్రితమే రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ ను జత చేసే ప్రక్రియ మొదలైనా చాలామంది ఇప్పటికీ రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ ను లింక్ చేయించుకోలేదు. దీంతో ఇప్పటివరకు రేషన్ డిపోలలో ఆధార్ వివరాలు ఇవ్వని కార్డుదారులంతా వెంటనే వివరాలు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు ఆధార్ నంబర్ నమోదు చేసినా చేయకపోయినా రేషన్ సరుకుల పంపిణీ జరిగింది. రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ ను లింక్ చేయడం ద్వారా అక్రమాలను సులభంగా అరికట్టవచ్చని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. ఈ నేపధ్యం లో ఇకపై రాష్ట్రంలో రేషన్ సరుకులను పొందాలంటే ఆధార్ నంబర్ ను ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సి ఉందని.. పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి అనిల్ కుమార్ నిన్న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. పౌర సరఫరాల శాఖ అధికారులు రాష్ట్రంలో చాలామంది రేషన్ దుకాణాల్లో ఆధార్ నంబర్ ను నమోదు చేసుకున్నారని తెలిపారు. కొంతమంది మాత్రం నమోదు చేయించుకోలేదని వాళ్లు నంబర్ ను లింక్ చేయించుకుంటే సులభంగా సరుకులు పొందవచ్చని వెల్లడించారు. రేషన్ దుకాణాల్లో ఆధార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన వారు మాత్రమే సరుకులను పొందే అవకాశాలు ఉంటాయి. బయోమెట్రిక్, ఐరిష్‌ నిర్ధారణల ద్వారా ఆధార్ వివరాలను నమోదు చేయనున్నారు. ఈ రెండు విధానాల వల్ల వివరాల నమోదు సాధ్యం కాకపోతే వన్‌టైం పాస్‌వర్డ్‌ ద్వారా లావాదేవీలను పూర్తి చేయవచ్చు.