సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడును పరామర్శించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి  తెలుగు ఇండస్ట్రీలో మీడియాతో, మీడియా జర్నలిస్టులతో కెరీర్ మొదట్నుంచి కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ.. మంచి అనుబంధం మెయింటేన్ చేస్తున్నారు. ముఖ్యంగా తన కెరీర్ కొత్తలో తన కోసం మంచి ఆర్టికల్స్ రాసిన వాళ్ళను ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు మెగాస్టార్. తన కెరీర్ ఎదగడంలో వాళ్లు కూడా కీలక పాత్ర పోషించారని ఇప్పటికీ చెప్తూనే ఉంటారు మెగాస్టార్. అందుకే ఫిలిం జర్నలిస్టులకు తనదైన సాయం చేస్తూనే ఉంటారు చిరంజీవి. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే వాళ్లకు సాయం చేస్తుంటారు.. ఇంటికి వెళ్లి పరామర్శిస్తుంటారు. గతేడాది సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు చనిపోతే ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ఇప్పుడు కూడా మరో జర్నలిస్ట్ అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకుని వెంటనే ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారు మెగాస్టార్. గత మూడు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడున్న సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడును ఆయన ఇంటికి వెళ్లి కలిసారు చిరంజీవి. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా కూతురు నిహారిక పెళ్లి బిజీలో ఉండి కూడా రామ్మోహన్ నాయుడు ఇంటికి వెళ్లి ఆయనకు ధైర్యం చెప్పారు చిరంజీవి. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

హామీ ఇవ్వడమే కాక ఆయన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ AIG హాస్పిటల్‌లో చేర్పించేందుకు ఏర్పాటు చేసారు చిరంజీవి. జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడుతో చిరుకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తను ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు చురుకైన పాత్ర పోషించాడు. అంతేకాదు ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం కోసం ఇన్నాళ్లూ పని చేసాడని చిరు చెప్పుకొచ్చారు. ఇలాంటి నిబద్ధత కలిగిన పాత్రికేయులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఎంతో ఉందని తెలిపారు మెగాస్టార్. ఓ వైపు ‘ఆచార్య’ షూటింగ్, మరోవైపు నిహారిక వివాహం ఉన్నా కూడా రామ్మోహన్ నాయుడును పరామర్శించడానికి వచ్చిన మెగాస్టార్ ను చూసి అంతా ప్రశంసిస్తున్నారు.