90 శాతం పూర్తయిన పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులు

తెలంగాణ సచివాలయ కూల్చివేత పనుల కవరేజీకి మీడియా సంస్థలకు అనుమతిచ్చిన కేసీఆర్ సర్కారు. ఇప్పటికే పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులు 90 శాతం పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధుల బృందం బీఆర్‌కే భవన్ నుంచి కవరేజీకి అనుమతి ఇవ్వనున్నారు. ఎత్తయిన భవనాల కూల్చివేత సందర్భంగా శిథిలాలు పడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం మీడియా కవరేజీకి అనుమతి ఇవ్వలేదు. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ మీడియా హైకోర్టును ఆశ్రయించింది. మిగతా మీడియా సంస్థలు కూడా కవరేజీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత విషయమై సర్కారు అనేక ఆటంకాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. గత ఏడాది నూతన సెక్రటేరియట్ భవనానికి శంకుస్థాపన చేయగా.. కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితుల కారణంగా  సచివాలయం కూల్చివేత పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కూల్చివేత ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత కూడా హైకోర్టు‌లో వేసిన పిటిషన్ల కారణంగా చాలా రోజులపాటు నిలిపి వేయాల్సిన పరిస్థితి వచ్చింది.