అమరావతి మరో నందిగ్రామ్ అయ్యే అవకాశం

ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన సీఆర్డీయే, వికేంద్రీకరణ బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిపై గవర్నర్ న్యాయసలహా కోరడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళన తాజా పరిణామాలతో ఉధృతమవుతోంది. గవర్నర్ నుంచి సానుకూల నిర్ణయం కోసం రైతులు ఆతృతగా ఎంతో ఆశ తో  ఎదురుచూస్తున్నారు. గవర్నర్ వద్ద బిల్లుల ఆమోదం ఆలస్యం చూస్తుంటే ఈ ప్రతిష్టంభన మరికొంతకాలం సాగే అవకాశముంది.

 ఎట్టి పరిస్ధితుల్లోనూ అమరావతిని ఏపీ రాజధాని గా కొనసాగించి తీరాలని స్ధానిక రైతులతో పాటు విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టుల పట్టుదల.. ఎలాగైనా విశాఖకు తరలించాలని జగన్ సర్కారు మొండితనం. రాజధానిపై ఎవరి వ్యూహాలు వారివి కాగా… ఎట్టకేలకు అసెంబ్లీలో రెండోసారి ఆమోదించి గవర్నర్ కు పంపిన ఈ బిల్లుల భవిష్యత్తు ఏం కానుందనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతోంది. అయితే రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమా, రాష్ట్రమా అనే సందేహాలు ఇంకా హైకోర్టు వద్ద కూడా కొత్తగా వ్యక్తం కావడంతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆగస్టు 6వ తేదీ వరకూ గడువిచ్చింది. ఈ లోపు ఏదీ జరగబోదని, జరిగితే తాము చూసుకుంటామని కూడా హైకోర్టు పిటిషనర్లకు చెప్పడంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.

రాజధాని బిల్లులు గవర్నర్ చెంతకు చేరిన నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు గవర్నర్ పైనా ఒత్తిడి పెంచేందుకు రాజధాని రైతులు ప్రతీ రోజూ నిరసనలకు దిగుతున్నారు. కరోనా కావడంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కేంద్రం, రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ కు విజ్ఞప్తులు పంపుతున్నారు. దీంతో ఈ వ్యవహారం రోజురోజుకీ సంక్లిష్టంగా మారుతోంది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజధానిని కదిలిస్తే అమరావతి మరో నందిగ్రామ్ అవుతుందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా బాంబు పేల్చారు. దీంతో నందిగ్రామ్ తరహా నిరసనలకు సిద్దం కావాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. తాజా పరిస్ధితుల నేపథ్యంలో ప్రతికూల నిర్ణయం వస్తే తీవ్ర ప్రతిఘటనకు రైతులు కూడా సిద్దమవుతున్నట్లు మనకు అర్ధమవుతుంది.