పాటంశెట్టి చిన రాఘవయ్యపార్కుపై పాలకులకు, అధికారులకు ఎందుకింత నిర్లక్ష్యం

గుంటూరు పట్టణాన్ని ఆరోగ్య నగర్ గా మార్చేందుకు పార్కులను అభివృద్ధి చేస్తున్నామంటూ చెబుతున్న నగరపాలక సంస్థ కమీషనర్ కీర్తి చేకూరికి రెండు దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురై అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన శ్రీనివాసరావు తోటలోని పాటంశెట్టి చిన రాఘవయ్య పార్కు కనపడకపోవటం శోచనీయమని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య నగర్ లో శ్రీనివాసరావుతోటకు స్థానంలేదా అని, ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారని కమీషనర్ ని ప్రశ్నించారు. దాదాపు నలభై వేలమంది నివసించే ఈ ప్రాంతంపై నాయకులకు, అధికారులకు ఎందుకు చిన్నచూపో అర్ధం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాఘవయ్య పార్కుని జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. పార్కు మొత్తం పిచ్చి మొక్కలతో, గడ్డితో పెరిగిపోయిందని, బెంచీలు, ఆట వస్తువులు పూర్తిగా పాడైపోయాయి అన్నారు. ఇక్కడి మహిళలు నడక కోసం, వ్యాయామం చేయడం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందన్నారు. ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించాలన్న బాధ్యతను పాలకులు, అధికారులు ఎప్పుడో గాలికివదిలేసారని దుయ్యబట్టారు. ఈ పార్కులో మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాలు సేవిస్తున్నారన్నారు. ఈ నేపధ్యంలో చుట్టుపక్కల ప్రజలు ఎప్పుడేమి జరుగుతుందో అన్న భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు మొత్తుకుంటున్నా వారి మొర వినేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పార్కు అభివృద్ధి పై పలుమార్లు సంబంధిత అధికారులను, స్థానిక నేతలను కలిసినా ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ లకు ఈ పార్కు దుస్థితి గురించి తెలిసినా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కమీషనర్ కీర్తి చేకూరి అన్నా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పార్కుని అభివృద్ధి చేయాలని కోరారు. వాకింగ్ ట్రాక్ నిర్మించి వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేయాలని, పిల్లలు ఆడుకోవటానికి ఆట వస్తువులను కూడా ఏర్పాటు చేయాలని కోరారు లేనిపక్షంలో స్థానిక ప్రజల్ని కలుపుకొని ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఆళ్ళ హరి హెచ్చరించారు. పార్కుని పరిశీలించిన వారిలో డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, వడ్డె సుబ్బారావు, సయ్యద్ రఫీ, పరిసపోగు రమేష్, యాకోబు, సాయి, సలాం తదితరులున్నారు.