అమరావతి కోసం 17న జనసేన “జనభేరి”

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకుని ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అమరావతి ఉద్యమం కూడా ఏడాది పూర్తి చేసుకుంటోంది. దీంతో ఈ నెల 17న విభిన్న రూపాల్లో ఆందోళనలు నిర్వహించేందుకు విపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే రాజధాని రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తున్న టీడీపీ నేతలు భారీ ఎత్తున నిరసనలకు సిద్ధమయ్యారు. ఇదే కోవలో జనసేన పార్టీ కూడా భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది.

ఈ నెల 17న అమరావతిలోని రాయపూడిలో ఉద్యమానికి మద్దతుగా భారీ బహిరంగసభ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఇవాళ జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాయపూడి పెట్రోల్‌ వద్ద ఈ సభ నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ సభలో జనసేన నేతలతో పాటు మిత్రపక్షం బీజేపీ నేతలు, స్ధానిక రైతులు కూడా పాల్గొనే అవకాశముంది. దీంతో అమరావతివిషయంలో తమ స్టాండ్‌ మరోసారి బలంగా వినిపించాలని జనసేన భావిస్తోంది.

రాజధాని ఉద్యమం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్బంగా రైతులకు మద్దతివ్వడం ద్వారా ఈ ప్రాంతంలో భవిష్యత్తులో కీలక పాత్ర పోషించాలని జనసేనతో పాటు మిత్రపక్షం బీజేపీ కూడా భావిస్తోంది. కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతికి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో బీజేపీ బాటలోనే తాము కూడా అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆరంభంగా జనభేరి సభ ఉండేలా నేతలు ప్లాన్‌ చేస్తున్నారు.