ప్రజల పక్షాన నిలబడితే అక్రమ కేసులు పెడతారా?: త్యాడ రామకృష్ణారావు

  • కేసులు బనాయించడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం
  • యశస్వి పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం పిరికిపాటుచర్య
  • దళిత, గిరిజన మహిళలకు అన్యాయం జరిగినప్పడు ఎక్కడ మీ చట్టాలు?

విజయనగరం: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు అన్నారు. గత కొన్నేళ్లుగా నివాసముంటున్న బొగ్గుల దిబ్బలో ప్రజలను ఉన్నపళంగా రోడ్డు కీడ్చడాన్ని ఖండిస్తూ ప్రజల పక్షాన నిలిచిన జనసేన పార్టీ నాయకురాలు యశస్వి పై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమని, దీన్ని ప్రభుత్వం, అధికార పార్టీ నాయకుల నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు. సరియైన విచారణ, ఆధారాలు లేకుండా అట్రాసిటీ కేసు పెట్టడాన్ని పిరికిపాటు చర్యగా అభివర్ణిస్తున్నామని, దళిత, గిరిజన మహిళ లకు తీవ్రమైన దాడులు, అత్యాచారాలు, హత్యలు, మానసిక వేధింపులు జరిగినప్పుడు ఏమయ్యాయి ఈ కేసులు, ఈ చట్టాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. పార్టీ ప్రతినిధి, మహిళ అనికూడా చూడకుండా పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారని, ప్రజాస్వామ్యంలో హక్కులను కాలరాస్తున్నారని, అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాలని కోరుతూ ఈ సంఘటనపై పార్టీ ఆదేశాల మేరకు న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.