ఓటమి భయంతోనే వైసీపీ మంత్రుల గావు కేకలు.. ఆళ్ళ హరి

  • ఆవిర్భావ సభతో వైసీపీకి పతనం మొదలైంది
  • కులాలు పక్కనబెట్టి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తే వైసీపీ నేతలకు భయమెందుకు?
  • మీ దాష్టీకాలపై ప్రజల మౌనం విస్ఫోటనమయ్యే సమయం ఆసన్నమైంది
  • గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

జనసేన పార్టీ ఆవిర్భావ సభకు హాజరైన లక్షలాదిమంది జనసమూహాన్ని చూసిన వైసీపీ నేతలకు వెన్నులో వణుకు మొదలైందని, పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఓటమి భయంతోనే వైసీపీ మంత్రులు గావుకేకలు పెడుతున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. బుధవారం వైసీపీ మంత్రులు గుడివాడ అమర్నాధ్, కారుమూరి నాగేశ్వరరావు, పేర్ని నాని, కరణం ధర్మశ్రీలు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా మంగళవారం మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభతో వైసీపీ పతనం మొదలైందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై, వాళ్ళు నిర్వహిస్తున్న శాఖలపై ఏనాడూ మీడియా ముందుకు రాని మంత్రులు పవన్ కళ్యాణ్ పై అవాకులు చెవాకులు పేలాటానికి మాత్రం క్యూ కడుతున్నారని విమర్శించారు. ఇన్నాళ్లూ కులాల మధ్య కుంపట్లు రాజేసి రాజకీయ చలి కాచుకుంటున్న నేతలకు కులాలు పక్కనబెట్టి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నం కంటగింపుగా ఉందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజాసమస్యలు పట్టకుండా, తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయ్యారని, పవన్ కల్యాణ్ మాత్రం అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారని కొనియాడారు. అధికారంలో ఉండి ప్రజాధనాన్ని దోచుకోవడం దాచుకోవటమే పనిగా పెట్టుకొని ఎదుటివారిపై తిట్ల దండకంతో విరుచుకుపడటం మినహా ఈ నాలుగేళ్లలో ఈ రాష్ట్ర మంత్రులు సాధించిన ఘనత ఏమిటో ప్రజలకు వివరించాలన్నారు. అప్పులు చేసుకుంటూ బటన్ నొక్కే దగ్గరే పరిపాలనను పరిమితం చేసిన ముఖ్యమంత్రి దేశ రాష్ట్ర చరిత్రలో జగన్ రెడ్డి మినహా మరొకరు లేరని దుయ్యబట్టారు. కేవలం కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పదవులు పొందిన వాళ్ళు మాత్రమే జగన్ వెంట ఉన్నారని, కాపు సైన్యం అంతా పవన్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాపులను అడ్డంపెట్టుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ కాపులకు ఏమి చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఎవరి ఎత్తులు వాళ్ళకి ఉంటాయన్నారు. పొత్తులు అనేవి రాజకీయాల్లో అత్యంత సహజమని జనసేన పార్టీ ఎవరితో పెట్టుకోవాలో, పెట్టుకోకూడదో నిర్దేశించాల్సింది తాడేపల్లి ప్యాలెస్ కాదని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయాలు, ఆదేశాల మేరకే పవన్ కళ్యాణ్ నడుచుకుంటారన్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులు ఉన్నా లేకపోయినా జనసేన చేతిలో వైసీపీ చిత్తు చిత్తు అవ్వటం ఖాయమన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ నడిపేందుకు కావాల్సిన ఆర్ధిక వనరుల కోసమే సినిమాలు చేస్తున్నారన్నారు. ఆయన నిత్యం ప్రజల్లో ఉంటే వైసీపీ అడ్రెస్ గల్లంతు అవుతుందని, ఆ సమయం కూడా ఎంతో దూరంలో లేదన్నారు. మీలాగా, మీ నాయకుడిలాగా కోడికత్తి డ్రామాలతోనో, గొడ్డలి పోటులతోనో పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని అనుకోవటం లేదని, ప్రజల్లో తన నాయకత్వం, నిజాయితీ మీద నమ్మకం కలిగినప్పుడే అధికారాన్ని స్వీకరిస్తారన్నారు. మీరెన్ని అరాచకాలు చేసినా దుర్మార్గాలకు పాల్పడినా, రోజు రోజుకి మీ దాష్టీకాలు పెరిగిపోతున్నా ప్రజలు మౌనంగా ఉన్నారులే అనుకుంటే పొరపాటన్నారు. ఈ మౌనానికి సరైన సమాధానం రానున్న ఎన్నికల్లో తమ ఓటు ద్వారా తెలియచేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు గ్రహిస్తే మంచిదన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పై విమర్శలు మానుకొని ఉన్న కొద్దిపాటి పడవీకాలాన్ని అన్నా రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని లేని పక్షంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వైసీపీ నేతలను ఆళ్ళ హరి హెచ్చరించారు.