ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి ఫస్ట్ లుక్

తమిళనాడు మాజీ సిఎం దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’. ఈ సినిమాలో జయలలిత పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటి కంగనారనౌత్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జయలలిత జీవితంలో కీలక వ్యక్తి అయిన తమిళనాడు మాజీ సిఎం ఎంజిఆర్ పాత్రలో అందాల నటుడు అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఎంజిఆర్ జయంతి సందర్భంగా గురువారం ‘తలైవి’ సినిమా నుంచి అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ ఆకట్టుకునేవిధంగా ఉంది. కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. ‘మక్కల్ తిలగమ్’ (ప్రజానాయకుడు) గా తమిళ ప్రజలు పిలుచుకునే ఎంజిఆర్ తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఎంజిఆర్ చనిపోయిన తర్వాత ఆయన వారసురాలిగా జయలలిత ఎఐఎడిఎంకె పగ్గాలు చేపట్టారు. అనంతరం తమిళనాడుకు ఆరుసార్లు ఆమె ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.