యావత్ గిరిజన జాతికి చీకటి దినంగా భావిస్తున్నాం: డా.వంపూరు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు బోయవాల్మీకి, బెంతోరియా కులాలను ఎస్టి జాబితాలో చేర్చాలని ఈ నెల 24వ తేదీన వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చెయ్యడం యావత్ గిరిజన జాతికి చీకటి దినంగా భావిస్తున్నాం. మొత్తం గిరిజనప్రాంతం నుండి 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానం గెలిపించినందుకు కక్ష్య సాధింపు పద్దతిలో గిరిజన వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్న విషయం అందరికి తెలిసిందే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేనప్పటికీ రాజ్యాంగబద్ధమైన హక్కులు సైతం కాలరాస్తూ 5వ షెడ్యూల్ అధికరణలకు విరుద్ధంగా పవర్ ప్రాజెక్ట్స్ ఒప్పందాలు చేసిన విషయం కూడా యావత్ గిరిజన జాతికి తెలిసిన విషయమే అయినా కూడా క్షమిస్తున్న గిరిజన జాతిపై గొడ్డలి వేటు వేసే పద్దతిలో బోయవాల్మీకి, బెంతోరియా కులాలను ఎస్టి జాబితాలో చేర్చడానికి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మౌనంగా కూచున్న 6గురు ఎస్టి ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, ఒక ఎంపీ వీళ్ళు నిజంగా గిరిజనులా అనే అనుమానం గిరిజన ప్రజలకు ఏర్పడింది. పదవులు శాశ్వతం అనుకుంటూ జాతికి ద్రోహం చేసిన ఈ ఎమ్మెల్యేలు, మంత్రిని వైసీపీ ప్రభుత్వాన్ని గిరిజన ద్రోహులనకా ఇంకా ఏమని సంభోదించాలో అర్థం కావడంలేదు. కంచె చేను మెసే చందంగా గిరిజనులకు రక్షణ కవచంగా ఉండాల్సిన ఎస్టి కమిషన్ బిసి కులస్తులైన బోయవాల్మీకి, బెంతోరియా కులాలను ఎస్టి జాబితాలో చేర్చుటకు తీర్మానం చేశారంటే ఎస్టి కమిషన్ గిరిజన ద్రోహుల కమిషన్ అనాలా? లేకా కమీషన్ల కమిషన్ అనాలా? గిరిజన అస్తిత్వం నాశనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ అనాలో గిరిజన ప్రజలే నిర్ణయించాలి. దీనికి అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనే సాక్ష్యంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి 6. పాయింట్ ఫార్ములా జోనింగ్ విధానం వలన గిరిజనులకు ఎటువంటి నష్టం జరగదని కేవలం గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు మాత్రమే ఇబ్బంది ఉంటుందని ప్రకటన చెయ్యడం యావత్ గిరిజన జాతిని వంచన చేయడం కాదా? అని అడుగుతున్నాం. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేయడం కాదా? అని ప్రశ్నిస్తున్నాం దశాబ్దాలు గడిచినప్పటికి నేటికి డోలిమోతల జీవితాలు గడుపుతున్న గిరిజన జీవన విధానంపై ఏ మాత్రం జాలి కూడా లేదా? అని ప్రశ్నిస్తున్నాం. అసెంబ్లీకి సమాన హోదా ఉన్నా (ట్రైబల్ అడ్వైసర్ కమిటి) టి.ఏ.సి. గిరిజన జాతికి సంబంధించిన రాజ్యాంగ పరమైన ఏ అంశం అయినా ఆమోదించకుండా అసెంబ్లీలో ప్రవేశ పెట్టకూడదు కానీ ఇది టి.ఏ.సి విధానాలకు విరుద్ధంగా జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ గిరిజన ప్రజలు ఒక విషయంపై లోతైన ఆలోచన చెయ్యాలి ఎస్టి ఎమ్మెల్యేలంతా రహస్య ఆమోదం చేసారా? లేదంటే ప్యాకెజిలకు అమ్ముడు పోయారా? అందుకే మౌనంగా ఉన్నారా? వైసీపీ గిరిజన ప్రజా ప్రతినిధులారా మీకు జాతి మీద అభిమానం గాని, పౌరుషం గాని లేదా? మీరు గిరిజనులు కారా? ఎందుకు మౌనంగా ఉన్నారు? పదవులు శాశ్వతం అనుకుంటున్నారా? పైన పేర్కొన్నట్టుగా స్వజాతిని భక్షించే గోముఖా వ్యాఘ్రాలుగా మిమ్మల్ని బావించాలా? మీరు గిరిజన జాతికి సమాధానం చెప్పాలి లేదా రాజీనామా చేసి మీ సశ్చిలత నిరూపించుకోవాలి తప్పదు మీరు గిరిజనులైతే గిరిజన సమాజ శ్రేయస్సు నిజంగానే కోరేవారైతే సమాధానం చెప్పి తీరాలి. కావున గిరిజన ప్రజల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అసెంబ్లీలో జరిగిన సమావేశంలో గల తీర్మానానికి విరుద్ధంగా అఖిలపక్షాలు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల తేదీ 31.03.2023 శుక్రవారం జరగబోయే బంద్ లో యావత్ గిరిజన జాతి స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని ప్రభుత్వానికి తమ వ్యతిరేకత తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా గిరిజన మనోభావాలకు గౌరవిస్తూ మన జాతిని పరిరక్షించుకునేవిషయంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా జనసేనపార్టీకి సంబంధించిన యావత్ గిరిజన నాయకులు బంద్ లో ప్రధాన భూమిక పోషించాలని విజ్ఞప్తి చేస్తున్నామని జనసేనపార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య అన్నారు.