జేసీ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి

తాడిపత్రి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తీవ్రంగా ఆగ్రహించారు. జేసీ ప్రభాకర రెడ్డి ఇంటి మీద దాడికి తెగబడ్డారు. ఆయన ఇంట్లో ఉన్న ఇద్దరు యువకులను కొట్టారు. వారిని బయటకు లాక్కు వచ్చి.. ఎవడొస్తాడో రండిరా అంటూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందే తిష్ట వేసి కూర్చున్నారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరని సమాచారం.

సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్టు… అనంతపురం జిల్లా రాజకీయాల్లో చిచ్చు రాజేసింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎడ్ల బండ్లలో తరలించే ఇసుకకూ డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ…నేరుగా జేసీ ఇంటికెళ్లారు పెద్దారెడ్డి. దాంతో జేసీ అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయ్‌. రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులను లెక్కచేయలేదు. పరిస్థితి అదుపుతప్పడంతో లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వెళ్లారు. అనుచరులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడి ఘటనపై కంప్లెయింట్ చేస్తే… కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. ఐతే తాను రిపోర్ట్‌ చేసేందుకు సిద్ధంగా లేనని జేసీ ప్రభాకర్ పోలీసుతో చెప్పారు.

అలానే తాడిపత్రిలో దాదాగిరీ చేయాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చారని ఆరోపించారు… మాజీ ఎమ్మెల్యే JC ప్రభాకర్‌రెడ్డి. కానీ తనకు అలాంటి ఉద్దేశం లేదని కౌంటర్‌ ఇచ్చారు… పెద్దారెడ్డి.

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల్ని బరిలో దింపకుండా భయపెట్టడానికే ఇదంతా చేస్తున్నారని జేసీ ఆరోపిస్తే… తాను అంత పిరికిపందను కాదని కౌంటర్‌ ఇచ్చారు… పెద్దారెడ్డి.