వైకుంఠ ఏకాదశి విశిష్టత

మహా విష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది (ముక్కోటి) దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు గనక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి వైష్ణవ భక్తులకు పవిత్రమైనది. తిరుమల సహా అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉండే ద్వారాన్ని తెరుస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటే సకల పాప నివారిణితోపాటు వైకుంఠ ప్రవేశం చేసినంత పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఏకాదశి నాడు వ్రతం ఆచరించడం వల్ల శ్రీమన్నారాయణుడిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ వ్రతానికి ఎంతో పురాణ ప్రాశస్తి ఉన్నది.

పురాణ ప్రాశస్తి..

పురాణాల ప్రకారం.. కృత యుగంలో చంద్రావతి నగరాన్ని రాజధానిగా చేసుకుని మురాసురుడనే రాక్షసుడు పాలించేవాడు. మురాసురుడు బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. ప్రజలు, విష్ణుభక్తులు, దేవతలను హింసించడం మొదలు పెట్టగా.. అతడి బాధలు తట్టుకోలేక దేవతలు, ఋషులు కలిసి శ్రీ మహా విష్ణువును ప్రార్థించగా.. మహా విష్ణువు మురతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం వెయ్యి సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో మహా విష్ణువు అలసిపోవడం జరిగింది. అలసట తీర్చుకొనేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. విష్ణు మూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నించగా.. విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించి.. ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ కన్య పక్షములో 11వ రోజు ఉద్భవించింది గనక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు. నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని.. ఎవరైతే ఆరోజు ఉపవాస దీక్ష చేస్తారో.. వారు సర్వవిధ పాపాలనుంచి విముక్తి పొందుతారని మహా విష్ణువు అభయమిచ్చెను. మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాపవిముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాప పురుషుడు బాధపడి మహా విష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను. ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన మూడు గ్రహాల కలయిక జరుగును. ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు. ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు. ఏకాదశి రోజున అన్నం, పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాపపరిహారం ఉండదని మహా విష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటోంది. ఏకాదశి రోజున అన్నం, పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు, పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరి నామస్మరణతో గడిపిన వారికి మహా విష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి.

ఉత్తర ద్వార విశిష్టత..

ఉత్తర ద్వారమనగానే దైవాన్ని ఉత్తర దిక్కుగా కూర్చుండబెట్టి దర్శనం కలిగించడమని భావిస్తారు. కానీ అది నిజమైన దర్శనం కాదంటారు పండితులు. ఉత్తరాయణంలో శరీరంలో ఏ బ్రహ్మ రంధ్రం అయితే ఉందో (మాడు).., ఆ మధ్య భాగంలో పరమేశ్వరుడు ఉంటాడని, పరమేశ్వరుడి దర్శనం బ్ర హ్మ రంధ్ర స్థానంలో ఉండే ఉత్తర ద్వార దర్శనమని పండితులు చెబుతున్నారు. బ్రహ్మ రంధ్రం రెండు తలుపులతో ఇమిడి ఉంటుందని, వీటిని తెరిస్తే యోగి పుంగవులకు భగవంతుడి దర్శనమవుతుందని, అది కేవలం ఈ మార్గశి ర మాసంలోనే వస్తుందంటున్నారు. దీనినే ఉత్తర ద్వార దర్శనమని అంటారు. ధనుర్మాసంలో స్వామివారిని ఉత్తర ద్వారముఖంగా చూడాలని పెద్దలు చెప్తారు.