వైసీపీ దౌర్జన్య పాలనకు ప్రజలు స్వస్తి పలికే రోజులు దగ్గరపడ్డాయి

గుంటూరు, వైసీపీ అధికారాన్ని చేపట్టిన క్షణం నుంచి రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగుతోందని, వైసీపీ నేతల దౌర్జన్య, దాష్టీక పాలనకు ప్రజలు స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. తెనాలి ఆర్యవైశ్య నాయకుడు, మున్సిపల్ కౌన్సిలర్ దేసు యుగంధర్ పై వైసీపీ కార్పొరేటర్లు చేసిన భౌతిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు దేసు యుగంధర్ ను ఆయన స్వగృహంలో ఆదివారం నేరేళ్ళ సురేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో జగన్ రెడ్డి మాయమాటలు నమ్మి ఆర్యవైశ్యులు మొత్తం గంపగుత్తగా వైసీపీకి ఓటేసినందుకు ఈరోజు ఇలా దాడులు చేస్తూ కృతజ్ఞత తీర్చుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించమన్నా, ప్రజాధన దోపిడీకి అడ్డుపడ్డా వైసీపీ నేతలకు ఎక్కడ లేని కోపం వస్తుందన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి దగ్గర నుంచి వైసీపీ నేతలకు కళ్ళముందే ఓటమి కనపడటంతో వెన్నులో వణుకు మొదలైందన్నారు. దీంతో అసహనం, నిరాశానిస్పృహలతో వైసీపీ నేతలకు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. అసలు ఆర్యవైశ్యులపై జగన్ రెడ్డికి ఎందుకింత కోపమో అర్ధం కావటం లేదన్నారు. తాము సంపాదించిన దాంట్లో సమాజానికి కూడా కొంత భాగం కేటాయించి సేవలు అందించే ఆర్యవైశ్యులను సంఘవిద్రోహులుగా వైసీపీ నేతలు చూడటం శోచనీయం అన్నారు. దేసు యుగంధర్ పై దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గద్దెనెక్కించిన ఆర్యవైశ్యులకు ఆ గద్దెను ఎలా దించాలో కూడా తెలుసన్నారు. ఇంకోసారి ఆర్యవైశ్యుల జోలికి వస్తే సహించేది లేదని నేరేళ్ళ సురేష్ వైసీపీ నేతల్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ కార్యదర్శి బండారు రవి కాంత్, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, బెల్లపు యస్వంత్, సుబ్రహ్మణ్యం, పులిగడ్డ గోపి తదితరులు పాల్గొన్నారు.