మత్స్యకార భరోసా వ్యవహారంలో ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు

• కరెంటు బిల్లు పేరుతో జాబితాలో కోత పెడుతున్నారు
• వేటకు వెళ్లే మత్స్యకారుల సంఖ్య పెరుగుతుంటే లబ్దిదారుల సంఖ్య తగ్గుతోంది
• వైఎస్ఆర్ బీమా పథకానికీ తూట్లు
• మత్స్యకారుల్ని ఓట్లు, రాజకీయాలకు వాడుకుంటున్నారు
• జనసేన మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్
• మత్స్యకారులకు అండ జనసేన జెండా
• కాకినాడ వేదికగా నినదించిన జనసేన శ్రేణులు
• మత్స్యకారుల సమస్యలపై భారీ నిరసన ప్రదర్శన

మత్స్యకారుల సమస్యలపై కాకినాడ వేదికగా జనసేన పార్టీ నినదించింది. మత్స్యకార భరోసా లబ్దిదారుల ఎంపికలో జరుగుతున్న అవకతవకల్ని ప్రశ్నించింది. అర్హులైన లబ్దిదారులందరికీ వేట విరామ జీవన భృతి అందాలంటూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. లబ్ధిదారుల జాబితాపై రీ సర్వే చేయాలని, తుది జాబితా విడుదల తేదీని పొడిగించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. జనసేన పోరాటానికి మద్దతుగా తరలివచ్చిన వందలాది మంది మత్స్యకార సోదరులు మత్స్యకారులకు అండ జనసేన జెండా అంటూ నినదించారు. వేట విరామ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసా లబ్దిదారుల ఎంపికలో వైసీపీ ప్రభుత్వం పాల్పడుతున్న అవకతవకల్ని వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ నిరసనకు దిగింది. వందలాది మంది మత్స్యకార సోదరులు, పార్టీ శ్రేణుల రాకతో జగన్నాథపురం ప్రాంతం మొత్తం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమ్రోగింది. మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాలపై జనసేన నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరసన నేపధ్యంలో జగన్నాథపురం రోడ్డు మొత్తం జనసేన జెండాలతో నిండిపోయింది. జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం, తూర్పు గోదావరి జిల్లా విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయంపై మత్స్యశాఖ సహాయ సంచాలకులకి వినతిపత్రం ఇచ్చేందుకు తలపెట్టిన ఈ కార్యక్రమం జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పాదయాత్రగా ప్రారంభమయ్యింది. జనసేన పార్టీ నాయకులు, వందలాది మంది మత్స్యకారులు తరలిరాగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కెనాల్ రోడ్డులో ఏటిమొగ ప్రాంతంలోని మత్స్యశాఖ కార్యాలయం వరకు ఈ పాదయాత్ర సాగింది. తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపేందుకు వచ్చిన శ్రీ మనోహర్ గారికి, పార్టీ నాయకులకు మత్స్యకార మహిళలు అడుగడుగునా హారతులు పట్టి ఆహ్వానం పలికారు. వేటకు వెళ్లే మత్స్యకారులు, బోట్ల యజమానలు, చేపలు అమ్ముకునే మత్స్యకార మహిళలు దారిపొడుగునా తమ సమస్యలు ఏకరువు పెడుతూ శ్రీ మనోహర్ గారికి వినతిపత్రాలు అందచేశారు. ముఖ్యంగా లబ్దిదారుల ఎంపికలో సచివాలయాలను, వాలంటీర్లను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం పాల్పడుతున్న అవకతవకలు, వేటకు వెళ్లే సమయంలో పడుతున్న ఇబ్బందులు, లబ్దిదారుల ఎంపిక వ్యవహారంలో బోటు యజమానులకు ఎదురవుతున్న సమస్యలు, డీజిల్ సబ్సిడీ తదితర అంశాలపై మనోహర్ గారికి వినతిపత్రాలు అందాయి. అర్హత ఉండి మత్స్యకార భరోసాకు ఎంపికకాని లబ్దిదారులు సైతం స్వయంగా శ్రీ మనోహర్ గారిని కలసి వినతిపత్రాలు సమర్పించారు. జనసేన పార్టీ ద్వారా మత్స్యశాఖ జె.డి.కి అందచేయాలని కోరారు. మధ్యలో ముస్లిం సోదరులు మత్స్యకారుల సమస్యలపై పోరాడేందుకు వచ్చిన శ్రీ మనోహర్ గారికి పవిత్ర వస్త్రం కప్పి ఆహ్వానించారు.
• డిమాండ్లతో ప్లకార్డుల ప్రదర్శన
అర్హులైన మత్స్సకారులందరికీ జీవనభృతి ఇవ్వాలి.. డీజిల్ సబ్సిడి వేటకు వెళ్లే మత్స్యకారులందరికీ వర్తింప చేయాలి.. మత్స్యకార గ్రామాలకు తాగునీటి వసతి కల్పించాలి.. బోట్లు, వలలు ఏర్పాటు చేసుకునేందుకు మత్స్యకారులందరికీ సబ్సిడీ రుణాలు అందచేయాలి.. తదితర డిమాండ్లను మత్స్యకార సోదరులు నిరసన ర్యాలీ ఆధ్యంతం ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. జనసేన జెండా అందరికీ అండ అనే నినాదాన్ని మత్స్యకారులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీల రూపంలో వేయించారు. వేట విరామ సమయంలో సాగుతున్న బోటు మరమ్మతులను మనోహర్ పరిశీలించారు. మత్స్యకారుల సమస్యలతో పాటు మరమ్మతులు చేస్తున్న వారి జీవనోపాధి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా ఏటిమొగలోని మత్స్యశాఖ జె.డి. కార్యాలయం ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మత్స్యకారుల సమస్యలపై జనసేన పార్టీ తరఫున గళం విప్పారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకార సోదరుల తరఫున పలువురు మత్స్యకార సంఘాల నాయకులు సమస్యలు చెప్పుకున్నారు.
• కొంత మందికే భరోసా: శ్రీ బొమ్మిడి నాయకర్
జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ “మత్స్యకార భరోసా వ్యవహారంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. ప్రభుత్వ పథకాలు, కరెంటు బిల్లులు సాకుగా చూపి లబ్దిదారుల జాబితాలో కోత పెడుతున్నారు. ఏటా వేటకు వెళ్లే మత్స్యకారుల సంఖ్య పెరుగుతుంటే భరోసా ఇచ్చే లబ్దిదారుల సంఖ్య కూడా పెరగాలి.. చిత్రంగా ఈ ప్రభుత్వంలో మాత్రం ఏటా జాబితా కుచించుకుపోతోంది. వైఎస్సార్ బీమా పథకానికి కూడా ఈ ముఖ్యమంత్రి తూట్లు పొడిచారు. మత్స్యకారులకు మొదటి నుంచి అండగా నిలిచింది జనసేన పార్టీయే. వేట విరామ సమయంలో మత్స్యకార సోదరులకు ఇచ్చే రూ. 10 వేల భరోసా ఈ ప్రభుత్వం కొంత మందికే ఇస్తుంది. మెకనైజ్డ్ బోట్లు, వలల సబ్సిడీలు సైతం కొంత మందికే ఈ ప్రభుత్వం ఇస్తుంది. వేటకు వెళ్లి సముద్రంలో ప్రమాదవశాత్తు చనిపోతే వారికి వైఎస్సార్ బీమా పథకం కింద రూ. 10 లక్షల పరిహారం చెల్లిస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరికీ పది లక్షలు ఇచ్చిన దాఖలాలు లేవు. కొన్ని గ్రామాల్లో మాత్రం రూ. 5 లక్షల పరిహారం ఇచ్చిచేతులు దులుపుకొన్నారు. మత్స్యకారుల సమస్యలపై మత్స్యకార సోదరులకు బాసటగా జనసేన పార్టీ ఈ రోజున పోరాటం చేస్తోంది. శ్రీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి మత్స్యకారుల పక్షాన పోరాడుతూనే ఉన్నారు. పోరాట యాత్రను గంగపుత్రుల మధ్య గంగమ్మ తల్లి సాక్షిగా ప్రారంభించి మత్స్యకారుల మీద తనకున్న మమకారం చాటుకున్నారు. ఉప్పాడలో పారిశ్రామిక కాలుష్యం మత్స్యకారుల అవకాశాల్ని దెబ్బ తీస్తుంటే వారికి మద్దతుగా తీర ప్రాంతంలో సభ నిర్వహించి గళం వినిపించారు. మత్స్యకారుల పొట్టకొడుతున్న 217 జీవో రద్దు కోరుతూ నరసాపురం వేదికగా మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహించి లక్షలాది మందితో కలసి నిరసన తెలిపారు. ఈ రోజున మత్స్యశాఖ సహాయ సంచాలకుల వారికి వినతిపత్రం ఇచ్చేందుకు స్వయంగా పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వచ్చారు. కష్టం వచ్చిన ప్రతి సందర్భంలో మత్స్యకారులకు అండగా నిలచిన జనసేన పార్టీకి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేమంతా రుణపడి ఉంటాం” అన్నారు.
• ఫించన్ ఇచ్చి భరోసా కట్ అంటున్నారు: శ్రీ కంబాల దాసు
పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మత్స్యకార సంఘాల నాయకులు శ్రీ కంబాల దాసు మాట్లాడుతూ “మత్స్యకారుల్ని పార్టీలు ఓట్లు, రాజకీయాలకు వాడుకుంటున్నారు. మత్స్యకారుల మీద నిజమైన మమకారం కలిగిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మత్స్యకారులకు ద్రోహం చేస్తూ ఈ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 217ని బహిరంగంగా చించి మాకు అండగా ఉంటానన్న భరోసా ఇచ్చారు. ఫించన్ ఇచ్చి మత్స్యకార భరోసా కట్ అంటున్నారు. డీజిల్ ధర రెట్టింపు పెరిగినా అదే రూ. 9 సబ్సిడి ఇస్తున్నారు. తీర ప్రాంత గ్రామాలు సముద్రపు ఆటుపోట్లకు తీవ్రంగా కోతకు గురవుతున్నాయి. పాదయాత్రలో ముఖ్యమంత్రి కాకినాడ నుంచి అంతర్వేది వరకు రక్షణ గోడ నిర్మిస్తామమని హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమయ్యిందో తెలియద”న్నారు. మరో మత్స్యకార నాయకుడు శ్రీ అమర్ మాట్లాడుతూ “300 యూనిట్లు దాటి కరెంటు బిల్లు వస్తే రూ. 10వేల భరోసాకి అర్హత లేదంటున్నారు. 2005లో శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మత్స్యకారులంతా నిరసన తెలిపితే జెట్టీలు ఏర్పాటు చేయడంతో పాటు చేపలు ఎండబెట్టుకునేందుకు ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తామని చెప్పి శిలా ఫలకాలు వేశారు. ఇప్పుడు ఆయన కొడుకు శ్రీ జగన్ రెడ్డి ఏకంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి పొమ్మంటున్నారు. టీడీపీ హయాంలోనే 7 బెర్తులు విస్తరణ పేరిట రాత్రికి రాత్రి మా గ్రామాల్లో ఇళ్లన్నీ తగులబెట్టించేశారు. మేము పట్టే మత్స్య సంపద ఇదే కుంబాభిషేకం రేవు నుంచి దేశ విదేశాలకు కోట్లాది రూపాయిల సరకు ఎగుమతి అవుతోంది. ఇవన్నీ వారికి అవసరం లేదు. వారి స్వార్ధ ప్రయోజనాల కోసం మత్స్యకారులందర్నీ ఖాళీ చేసేయమంటున్నారు. కలెక్టర్, మైరేన్ బోర్డులకు వినతిపత్రాలు ఇచ్చాం. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు వెళ్తోంది, మత్స్యకారుల్ని మోసం చేస్తోంది. మత్స్యకారుల్ని కాపాడే జెండా జనసేన జెండా మాత్రమేనన్న నమ్మకం మా అందరికీ వచ్చేసింద”న్నారు. కాకినాడకు చెందిన మత్స్యకారుడు మడ్డు విజయ్ మాట్లాడుతూ “తీర ప్రాంతం నుంచి మత్స్యకారుల్ని ఖాళీ చేయించే హక్కు ఎవరికీ లేదని పోరాటం చేసిన ఏకైక పార్టీ జనసేన మాత్రమేన”న్నారు. కార్యక్రమంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల అధ్యక్షులు కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, బండ్రెడ్డి రామకృష్ణ, పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, కోన తాతారావు, చేగొండి సూర్యప్రకాష్, పార్టీ నాయకులు డాక్టర్ మూగి శ్రీనివాస్, శ్రీమతి ఘంటసాల వెంకట లక్ష్మి, సంగిసెట్టి అశోక్, వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు, పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు పాల్గొన్నారు.