విద్యోన్నతికి అడ్డుగోడ!

* బీసీల ఊసే పట్టని వైకాపా
* సివిల్స్‌ శిక్షణకు ఊతం ఏదీ…. ఎక్కడ?

‘పైన పటారం, లోన లొటారం’ అని సామెత. దీనికి పూర్తి ఉదాహరణ జగన్‌ పాలన! విద్యోన్నతి పథకం స్ఫూర్తినే దెబ్బతీసింది చాలక, నిలువునా తూట్లు పొడిచిన ఘనత ఆయన ప్రభుత్వానిది! వెనుకబడిన తరగతుల విద్యార్థినీ విద్యార్థులు సివిల్స్‌ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని, ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించి పేరు తెచ్చుకోవాలని పథకం ఉద్దేశం. ఇది ఇప్పటిది కాదు, మునుపటి ప్రభుత్వ హయాంలోనూ ఉంది. పేద యువత కలలు సాకారమయ్యేలా, పలువిధాలుగా ఆదుకోవడమే లక్ష్యం. కానీ ‘బడుగులకు ఆర్థిక సాయం చేసి ఉన్నతికి తేవడమా’ అని కాబోలు అసలుకే ఎసరు తెచ్చింది వైకాపా! అంత ఉరుము ఉరిమి ఇంతేనా కురిసింది అన్నట్లు, హామీలు మాత్రం గుప్పించి చివరికి మొండి చేతులు చూపుతోంది. పథకం పేరూతీరూ మార్చేసి తనదైన శైలిని ప్రదర్శిస్తోంది.
*దయనీయ పరిస్థితి
గతంలో విద్యోన్నతి పథకం ఎన్టీఆర్‌ పేరున ఉంది. పేద బీసీలకు విద్య, ఆర్థిక పరంగా ఊతమిచ్చేందుకే అది రూపొందింది. వారు సివిల్స్‌ బాగా రాసేలా, దేశంలోని విఖ్యాత సంస్థల్లో శిక్షణ ఇప్పించడమే ధ్యేయం. హైదరాబాద్‌తోపాటు చెన్నై, బెంగళూరు, ముంబయి, దేశ రాజధాని మహానగరం దిల్లీలోనూ కోచింగ్‌ పొందే అవకాశం కలిగించారు. అభ్యర్థులు కోరుకున్న చోట శిక్షణపొంది ఉన్నతస్థాయికి చేరేలా ప్రోత్సహించారు. అంతా ఉచిత శిక్షణే. ఆయా సెంటర్ల ఫీజులను అనుసరించి ఒక్కో విద్యార్థిపైనా కనిష్ఠం రూ.80 వేలు, గరిష్ఠంగా రూ. లక్షా ఇరవై వేల వరకు వ్యయం చేసింది ఆనాటి ప్రభుత్వం. ఆ మొత్తాలను నేరుగా సంస్థల యాజమాన్యాలకే పంపించింది. ఆర్థికంగానే కాక, వస్తురూపంగా కూడా యువతకు సహాయ సహకారాలు అందించింది. పుస్తకాలు, ఇతర ఖర్చుల కోసం ప్రతి ఒక్కరికీ నెలకు రూ. పదివేల వంతున కేటాయించింది. అలా వరసగా తొమ్మిది నెలలపాటు చేయూతనిచ్చింది. ఆ విధంగా మొత్తం 6,250 మందికి లబ్ధి కలిగేలా చేసింది. ఇదంతా నాటి మాట.
*బకాయిలూ తీర్చలేదు
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో స్థితీగతీ మారింది. అధికార పీఠమెక్కిన వైకాపా శుష్క ప్రియాలు చెప్పింది, శూన్య హస్తాలు చూపింది. బీసీ యువత ఉన్నతస్థాయి చదువు, శిక్షణ కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కానక్కర్లేదని భరోసానైతే ఇచ్చింది. ఆచరణలో మాత్రం, మొత్తం విద్యోన్నతినే నామమాత్రం చేసేసింది. ఎన్టీఆర్‌ పేరును తొలగించి, వైఎస్‌ఆర్‌ పేరు తగిలించారు జగన్‌! దేశంలోని ప్రముఖ శిక్షణ సంస్థల్లో బీసీ యువతీయువకులు అడుగుపెట్టకుండా చేశారు. అంటే పథకం అమలురీతికే మంగళం పాడేశారు. ఆ స్థానంలో మెరుగైనది మరేదీ లేకుండా, రాకుండా వారి ఉసురుపోసుకున్నారు! అదివరకటి ప్రభుత్వం మూడొందల మందిపైగా అభ్యర్థులకు రూ. 2.56 కోట్ల మేర బకాయిపడింది. వారంతా దేశంలో ఉన్న పదకొండు ప్రసిద్ధ సంస్థల్లో శిక్షణ పొందిన యువత. పథకం అక్కడా ఆగింది, బకాయి చెల్లింపులూ కొండెక్కాయి. ఫలితంగా కొన్ని సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చింది.
*వారు ఆరు వేలు….వీరు ఐదొందలు!
జగన్‌ పుణ్యమా అని, మెరుగైన విధానం తెచ్చింది లేదు. ఆర్భాటంగా ప్రకటించిన బీసీ స్టడీ సర్కిల్స్‌లో సివిల్స్‌ ఉచిత శిక్షణ ఇప్పించిందీ లేదు. అసలు ఆ మాటే ఈ నాలుగేళ్ల పాలనా కాలంలో వినిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విస్తరణకు ముందు 13 సర్కిల్స్‌ ఉండేవి. అవే ఇప్పటికీ ఉన్నాయి, అదీ అలంకారప్రాయంగా! గతంలో లబ్ధి అరువేలమందికి పైగా కలిగితే, ఇప్పుడు ఆ సంఖ్య ఐదొందల లోపునే. ఆ శిక్షణ కూడా సివిల్‌ సర్వీసెస్‌కు కాకుండా! ఇదివరకైతే సివిల్స్‌ ఉచిత శిక్షణకు గ్రామస్థాయి నుంచీ పలువురు ఎంపికయ్యారు. తాము ఎంచుకొన్న రాష్ట్రాల సెంటర్ల ద్వారా తర్ఫీదు పొంది ప్రావీణ్యత గడించారు. పరీక్షల పరంగా పోటీతత్వాన్ని చాలామటుకు పెంచుకోగలిగారు. కొందరు నేరుగా సివిల్స్‌ ఉద్యోగాలు పొందలేకపోయినా, అందిన శిక్షణ కారణంగా ఇతరత్రా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించగలిగారు. ఇప్పటి పరిస్థితే అన్నివిధాలా దయనీయం. ఈ పాలనలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కాగితాల్లోనే దాగుంది, కేవలం అంకెలకే పరిమితమైంది.
* ఇప్పుడు బేజారు
గత 2019 ఆగస్టు నెలాఖరులో సంక్షేమశాఖ సమావేశం వేదికగా జగన్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ విద్యోన్నతి పేరుతో పథకం అవసరమా? అని ప్రశ్నించారని కూడా పత్రికల్లో వార్తలొచ్చాయి. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల జనసంఖ్య 2.14 కోట్లకు పైమాటే. వారికోసమే దాదాపు అరవై కార్పొరేషన్ల ఏర్పాటు అంటూ ఏనాడో ప్రకటనలు చేసిన ఆయన మరోవంక ‘విద్యోన్నతి’ పట్ల విముఖత చూపడమే విడ్డూరం. ఆ కార్పొరేషన్లూ నిధులు, విధులు లేక కునారిల్లుతున్నాయి. అన్ని వర్గాలకూ అందాల్సిన పథకాల ప్రయోజనాలనే తమ ప్రభుత్వం బీసీలకే ప్రత్యేకంగా ఇస్తున్నట్లు మభ్యపెడుతున్నారు. కొత్తగా నిధులివ్వకుండా, పాత బకాయిలను తీర్చకుండా, బడుగుల బాగోగులను ఎంతమాత్రమూ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వేధింపులు, సాధింపులు, ఉదాసీన వైఖరులతో బీసీలను విద్యాపరమైన ఉన్నతికి దూరం చేస్తున్నారు. వారి ఊసే పట్టకుండా, సివిల్స్‌ శిక్షణకు ఊతమివ్వాలన్న ఆలోచనైనా లేకుండా, అభివృద్ధికి అడ్డుగోడలా నిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి. నిలిపివేతలపై చూపుతున్నంత ఉత్సాహం పురోగతి పై చూపడం లేదన్నదే … సివిల్స్‌ ఉచిత శిక్షణను ఆశిస్తున్న వెనుకబడిన తరగతుల యువత ఆక్రోశం, ఆగ్రహం!