రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే బడ్జెట్

* సంక్షేమం, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు
* కూటమి హామీల అమలుకు మార్గనిర్దేశనం చేసేలా బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కొనియాడారు. అందుకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయి. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టింది. ఈ బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా, అభివృద్ధికి బాటలు వేసేదిగా ఉంది. ప్రాధాన్యతల వారీగా అన్ని శాఖలకు కేటాయింపులు పెరగడంతో పాటు, మూలధన వ్యయాన్ని రూ.40,636 కోట్లకు పెంచడం ద్వారా మౌలిక వసతులు రాష్ట్రంలో పెరుగుతాయి. తద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్ర రాబడి పెంపుదలకు బాటలు వేసినట్లు అయింది. రూ.3,22,359 కోట్లతో ప్రణాళికాబద్ధంగా రూపొందిన బడ్జెట్ ఇది. సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ లో కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వ విధానాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు జరపడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పటికే అందిస్తున్న పింఛన్ల పెంపుదల, దీపం 2 పథకాలకు నిధుల కేటాయింపుతోపాటు మిగిలిన సూపర్ సిక్స్ పథకాల హామీలను తప్పకుండా నెరవేరుస్తామని బడ్జెట్ కేటాయింపుల ద్వారా నిరూపించుకున్నాం. ‘తల్లికి వందనం’ పథకాన్ని ఈ ఏడాది మే నుంచి అమలు చేసేందుకు రూ.9,407 కోట్లను కేటాయించారు. అన్నదాతలకు భరోసానిచ్చేలా ఏడాదికి రూ.20 వేలు ప్రతి రైతుకు సాయం అందేలా ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. సాగు నీటి రంగానికి రూ.18,019 కోట్లు కేటాయింపులు శుభపరిణామం. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి వాక్కు అనుసారం గ్రామీణాభివృద్ధికి రూ.18,890 కోట్ల భారీ కేటాయింపులు ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకుంటాయి. నిధుల లేమి అనేదే లేకుండా గ్రామాల్లో అభివృద్ధి ఊపందుకోవడానికి ఈ బడ్జెట్ బాటలు వేస్తుంది. గ్రామాలకు కావల్సిన వసతులు, సౌకర్యాల కల్పనకు ఈ కేటాయింపులు దోహదం చేస్తాయి. జల్ జీవన్ మిషన్ పథకానికి బడ్జెట్ లో ప్రాధాన్యం దక్కడం సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కు రాష్ట్ర వాటా కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది. వచ్చిన నిధులను ప్రణాళిక లేకుండా ఇష్టానుసారం వ్యయం చేశారు. జల్ జీవన్ మిషన్ ను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2028 వరకు గడువు పొడిగించడం మన రాష్ట్రానికి ప్రయోజనకరమైన విషయం. వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు చెబుతున్నాయి. ఆక్వా రైతులకి విద్యుత్ యూనిట్ ధరను రూ.1.50 పై. చేయడం హర్షణీయం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం ఇతోధిక సహకారం అందిస్తోంది. జల్ జీవన్ మిషన్ పథకం పొడిగింపు ద్వారా మన రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇస్తూ మౌలిక వసతుల కల్పనకు తోడ్పాటు ఇస్తున్నారు. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, శాఖలకు తగిన కేటాయింపులు, సంక్షేమ ఫలాలపై తగిన దూరదృష్టితో ముందుకు వెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందించిన ఆర్థికశాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, రైతాంగానికి మేలు చేసే బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారికి, ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ శాఖల అధికారులకు ఈ సందర్భంగా అభినందనలు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Share this content:

Post Comment