జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన షాపింగ్ మాల్

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఆనంద్ షాపింగ్‌మాల్‌లో ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి ఎగసిపడుతూ క్రమంగా భవనం మొత్తం వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే భవనంలోని నాలుగు అంతస్తులకు మంటలు ఎగబాకాయి.

షాపింగ్‌మాల్‌లోని సామగ్రి కాలిబూడిదైంది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో వాటిని అదుపు చేయడం కష్టమైంది. మంటలు అదుపులోకి రావడానికి చాలా సమయం పట్టడంతో మాల్‌ కాలిబూడిదైంది. భారీ ఆస్తినష్టం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.