రామ మందిరం కోసం విరాళాలు సేకరిస్తోన్న ముస్లిం మహిళ

అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర, ఆర్ఎస్‌ఎస్‌తోపాటు వీహెచ్‌పీ లాంటి హిందూ సంస్థలు ఫండ్ రైజింగ్ చేస్తున్నాయి. అయితే రామాలయ నిర్మాణం కోసం మతాలకు అతీతంగా ముస్లింలు కూడా విరాళాలు సేకరించడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం మహిళ రామాలయ కన్‌స్ట్రక్షన్ కోసం విరాళాలు సేకరిస్తోంది. తహెరా ట్రస్ట్‌కు నిర్వాహకురాలైన సదరు మహిళ పేరు జహరా బేగం. హిందూ దేవుడైన రాముడి గుడి కట్టడానికి ముస్లిం కమ్యూనిటీకి చెందిన ప్రజలను డొనేషన్స్ ఇవ్వాల్సిందిగా జహరా కోరడం విశేషం.

హిందూ పండుగలైన వినాయక చవితి, దసరా, శ్రీ రామ నవమికి ముస్లింలు తోచినంత విరాళాలు అందిస్తారని.. ఇదే విధంగా రామాలయ నిర్మాణానికి కూడా డొనేషన్స్ అందించాల్సిందిగా కోరుతున్నానని జహరా తెలిపారు. అన్ని మతాల పండుగలను అన్ని మతాలకు చెందిన వారు కలసి చేసుకోవడమే నిజమైన భారత భిన్నత్వంలో ఏకత్వానికి స్ఫూర్తి అని చెప్పారు. ‘దర్గాలు, ఈద్గాలు, ముస్లిం శ్మశానాల (ఖబరిస్థాన్) కోసం హిందూ సోదరులు భూమిని విరాళంగా ఇవ్వడాన్ని చూస్తున్నాం. రాముడు పుట్టిన దేశంలో మనం ఉంటున్నాం. అలాంటి రాముడి భవ్య మందిరం మనం ఉంటున్న ప్రస్తుత సమయంలో నిర్మితమవ్వడం అదృష్టంగా భావించాలి. జీవితంలో ధర్మంగా ఉండటం ఎంత ముఖ్యమో ప్రపంచానికి రాముడు నేర్పాడు. పవిత్ర రాముడి ఆలయ నిర్మాణంలో మనందరం భాగమవుదాం’ అని జహరా పేర్కొన్నారు.