- అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సభలో వక్తల వినతి
విజయవాడ, క్రీ.శ. 575 సం.లోనే తెలుగుభాషను రాజభాషగా చేసి తొలి తెలుగు శాసనాన్ని చెక్కించిన రేనాటి చోళరాజు ఎరి(కల్) ముత్తురాజు ధనంజయుడి శిలావిగ్రహాన్ని శాసనసభా ప్రాంగణంలో ప్రతిష్టింపచేయాలని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తొలి తెలుగు దివ్వె తెలుగు మూలాల అధ్యయన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సభలో వక్తలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముందుగా సంఘ అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ శ్రీమతి పిల్లి లక్ష్మీతులసి జ్యోతి ప్రజ్వలనం చేసి తొలి తెలుగు శాసనకర్త నిలువెత్తు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీశ. 6 నుండి 10వ శతాబ్దం వరకు తెలుగును రాజభాషగా కొనసాగించి తెలుగుభాషను అభివృద్ధి చేసిన రేనాటి చోళమహరాజుల చరిత్రను ఉన్నతవిద్యలో ఒక పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం రోజున తొలి తెలుగు శాసనకర్త ధనంజయునికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నివాళులర్పించాలని కోరుతూ తొలి తెలుగు శాసనకర్తకు ‘భారతరత్న’ అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆమె కోరారు. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా హైదరాబాద్ నగరంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు ‘తెలుగు భాష పుట్టక – వ్యాప్తి’ పేరు మీద తెనుగోళ్లు, తెలుగోళ్లు మహాసభ నిర్వహిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పి.వి.ఎల్.ఎన్. రాజు తెలిపారు. ఈ మహాసభల్లో తెలుగు భాష పుట్టుక గురించి, తెలుగు భాషకు తెలుగు అనే పేరు ఎలా ఏర్పడిందని, ఆంధ్రకు ఆ పేరు ఎలా ఏర్పడిందని, తెలంగాణ పేరు ఎలా ఏర్పడిందని శాసన మరియు గ్రంధ పూర్వక ఆధారాలతో తెలిజేస్తున్నామన్నారు. ఈ విషయాల మీద ఇంత వరకు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సంస్థలు గానీ, మేధావులు, విద్యావంతులు, శాసన పరిశోధకులు, తెలుగు భాష గురించి పోరాడుతున్న మహానుభావులు ఎవ్వరూ ఏ సభల్లో కూడా తెలియజేయడం లేని కారణంగా ఈ మహాసభల్లో తొలిసారిగా తెలియజేస్తున్నామన్నారు. సీనియర్ జర్నలిస్ట్, తెలుగు భాషా పండితులు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యావిధానం ఇలానే కొనసాగితే ఈ ప్రభుత్వం తెలుగు దినపతిక్ర, ప్రచార మాధ్యమాలు, చలనచిత్రాలు, కళలపై కూడా ప్రభావితం చెయ్యగలదని హెచ్చరించారు. తొలి తెలుగు శాసనాలని రాజు దంపతులు ఎంతో శ్రమకోర్చి వెలుగులోకి తీసుకురాగా, మాజీ ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్యనాయుడు ఇటీవల ఎంతో శ్రద్ధతో కడప జిల్లాలో తొలి తెలుగు శాసనాలను సందర్శించి ఈ శాసనాలను బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారని నిమ్మరాజు కొనియాడారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా సంస్కార భారతి అధ్యక్షులు, ప్రముఖ రచయిత, దర్శకులు, 14 నంది అవార్డుల గ్రహీత డా.పి.వి.ఎన్.కృష్ణమరాజు, తులసి దంపతులు ఘనంగా సత్కరించారు. అనంతరం డా.పి.వి.ఎన్. కష్ణ తెలుగు భాషా పుట్టుక, ప్రాశస్త్యం పట్ల గేయాలాపన చేశారు. ఈ సభలో డా.వెలగ జోషి, డా.బి.ఆర్. అంబేద్కర్ దూరవిద్య కేంద్రం, ఆంధ్రప్రదేశ్, గోళ్ళ నారాయణరావు, అధ్యక్షులు, కామ్రేడ్ జి.ఆర్.కె.పోలవరపు సాంస్కృతిక సమితి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచర్ల జయరాజు, చింతా వెంకటేశ్వర్లు, చింతకాయల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తొలి తెలుగుదివ్వె ప్రధాన కార్యదర్శి ఎస్.ఉదయ భాస్కర్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
Share this content:
Post Comment