ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేవారిపైన సుమోటోగా కేసు నమోదు చేయాలి: ఆదాడ మోహనరావు

విజయనగరం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసే వారిపైన, వారికి సహకరించిన సంబంధిత అధికారులు,వ్యక్తులపైన మీడియాల్లో వచ్చిన వార్తా కథనాల ప్రకారం తగు విచారణ జరిపి, వారిపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు డిమాండ్ చేశారు. దీనిపై సోమవారం ఉదయం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కలక్టర్ గ్రీవెన్స్ లో విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వివిధ రాజకీయ పార్టీలతో సమీక్షలు నిర్వహించి, పట్టభద్రులకు ఓట్లు నమోదు చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చి, తీరా పట్టభద్రుల ఎన్నికల రోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఐదో తరగతి, ఏడో తరగతి చదివిన వారికి సైతం డిగ్రీ దొంగ పట్టాలను సృష్టించి, కష్టపడి డిగ్రీ చదువుకున్న విద్యార్ధుల మనోభావాలు దెబ్బతినేలాచేసి, రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా చేసిన వారిపై వివిధ మాధ్యమాలలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని దొంగ ఓట్లు వేసే వారిపైన వారికి సహకరించిన అందరికీ సుమోటో కేసుగా పరిగణించి, వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన తీసుకోవాలని కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఇచ్చామని, దానికి కలక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వినతిపత్రాన్ని ఇచ్చిన వారిలో పార్టీ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, త్యాడ రామకృష్ణారావు(బాలు) పాల్గొన్నారు.