ఈరోజు నుంచి రెండు వారాల పాటు అర‌కు వ్యాలీలో సంపూర్ణ లాక్‌డౌన్

ప్ర‌స్తుతం కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో విలయతాండవం చేస్తుంది. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. రోజుకి పదివేల మందికి పైగా కరోనా బారిన పడుతున్నారు. దాంతో ప్రభుత్వం, కరోనాను నిలువరించడానికి కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమ‌లు పరుస్తోంది.

ఇప్పుడు అర‌కు వ్యాలీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండడంతో, అధికారులు నేటి నుంచి రెండు వారాల పాటు అక్కడ సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు.

నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌ దుకాణాలు, మెడికల్ దుకాణాలు తప్ప  అన్నీ మూతపడనున్నాయి. గ‌త కొన్ని రోజులుగా, వారానికి రెండు రోజుల చొప్పున లాక్‌డౌన్ విధిస్తూ వ‌స్తున్నా, క‌రోనా మహమ్మారి అదుపులోకి కాక‌పోవ‌డంతో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అదలా ఉంటే ఆంధ్ర‌ప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 10,328 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,96,789కు చేరింది. అలాగే గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 72 మంది మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య 1,753కి పెరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,12,870కి చేరగా, 82,166 మంది కరోనాతో పోరాడుతున్నారు.