ఆచార్య: ఫుల్ లెంగ్త్, పవర్ ఫుల్ రోల్ లో చరణ్‌

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘ఆచార్య’. వచ్చే వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలన్న లక్ష్యంతో పని చేస్తోంది చిత్ర బృందం. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి వేరు. అలాంటిది వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్లు చేసిన కొరటాల శివ దర్శకత్వం వహించడం, పైగా రామ్ చరణ్ ఇందులో కీలక పాత్ర పోషించడంతో ఆసక్తిని, అంచనాలను రెట్టింపు చేయడం సహజం.

చిరు, కొరటాల.. ఇద్దరూ కూడా ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఈ మూవీలో కొద్ది నిమిషాల పాటు చెర్రీ కనిపించబోతున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. దాన్ని చిరంజీవి ధృవీకరించారు. ఆ పాత్ర చాలా కీలకమైందని, స్టోరీ చెప్పే సమయంలోనే ఇందులో చెర్రీని ఊహించుకున్నట్లు చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చరణ్ చేయనున్న పాత్ర, దాని నిడివిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ క్యారెక్టర్ గురించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు కొరటాల. చరణ్ చేయనున్నది అతిథి తరహా పాత్ర కానే కాదని కొరటాల స్పష్టం చేశాడు. చరణ్‌ది ఫుల్ లెంగ్త్ రోల్ అని తెలిపాడు. చరణ్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని కూడా కొరటాల తెలిపాడు.

చరణ్ పాత్రకు సంబంధించి ఇంకా చిత్రీకరణ మొదలుపెట్టలేదని, అతి త్వరలోనే అతను అందుబాటులోకి వస్తాడని.. చిరు, చరణ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూపించడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని కొరటాల తెలిపాడు. తొలి సినిమా ‘మిర్చి’ తర్వాత కొరటాల రామ్ చరణ్‌తోనే రెండో సినిమా చేయాల్సింది. బండ్ల గణేష్ నిర్మాణంలో ఈ సినిమాకు ప్రారంభోత్సవం కూడా చేశారు. కానీ అనివార్య కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఎట్టకేలకు చరణ్‌ను కొరటాల డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఇక మెగాస్టార్‌తో సినిమా చేస్తున్న అనుభవం గురించి కొరటాల మాట్లాడుతూ.. ”నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయన సినిమాకు నేను యాక్షన్, కట్ చెప్పడం నమ్మలేకపోతున్నా. ప్రతి రోజూ నాకు అది ఆశ్చర్యాన్ని గొప్ప అనుభూతిని ఇస్తూనే ఉంటుంది. చిరంజీవి గారు ఎందుకు మెగాస్టార్ అయ్యారో సెట్లో తెలుస్తూ ఉంటుంది. నా పనిని ఆయన తేలిక చేస్తారు. సెట్లో ప్రతి విషయాన్నీ కూలంకషంగా తెలుసుకుంటారు. ఎంతో హోమ్ వర్క్ చేసి షూటింగ్‌కు వస్తారు” అని కొరటాల తెలిపాడు.