యాదాద్రిలో ప్రారంభమైన ఆర్జిత సేవలు

తెలంగాణ… యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మళ్లీ భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు అనూహ్య సంఖ్యలో తరలివచ్చారు. అంత మంది వస్తారని నిర్వాహకులే అంచనా వెయ్యలేదు. ఎప్పుడో మార్చి 22న కరోనా కారణంగా… ఆర్జిత సేవల్ని నిలిపేశారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో సుమారుగా 6నెలల తరువాత ఆలయ పూజారులు ఆర్జిత సేవలు పున:ప్రారంభించారు. ఈ సేవలను శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఉదయం నుంచి ప్రారంభించారు. నేటి నుంచి శ్రీస్వామి వారి ఆర్జిత సేవలైన అభిషేకం, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన పూజలు, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీస్వామి వారి వెండి మొక్కు జోడు సేవలు, చేసుకునేందుకు భక్తులను అనుమతించినట్లు ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా ఎంతో భక్తి శ్రద్దలతో భక్తులకు స్వామివారికి ఇచ్చే తలనీలాలు సమర్పించేందుకు కల్యాణ కట్టను సైతం తెరిచినట్లు తెలిపారు. ఇక ఆర్జిత సేవలు ప్రారంభం అయిన క్రమంలో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో స్వామి వారి దర్శనానికి దాదాపు రెండు నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతుంది. కరోనా నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులను అనుమతించే క్రమంలో థర్మల్ స్క్కీనింగ్,శానిటైజర్ ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.