‘రంగా’ పాత్రలో నటించడం నా పూర్వజన్మ సుకృతం..

బెజవాడ పేరెత్తితే వినిపించే పేర్లు వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ. ఇప్పుడు ఆ ఇద్దరి కథతో నర్రా శివనాగు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కింది. ‘దేవినేని’ టైటిల్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు ప్రధాన పాత్రలలో నటించడం విశేషం. ‘బెజవాడ సింహం’ అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ చిత్రంలో వంగవీటి రంగా పాత్రలో నిర్మాత సురేష్‌ కొండేటి నటించారు. ఈ చిత్రం శుక్రవారం (మార్చి 5న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సందర్భంగా తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.

బెజవాడ నేపథ్యంలో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన వంగవీటి మోహనరంగా పాత్రలో నటించాను. అందుకే తొలుత బందరురోడ్డులో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించాను. సినిమా అన్ని వర్గాలకు నచ్చేలా మా దర్శకుడు శివనాగు తెరకెక్కించారు. అన్ని క్యారెక్టర్స్‌ను చక్కగా మలిచారు. నిర్మాతలకు నా ధన్యవాదాలు. సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది.

అలాగే.. ఎవరిని కించపరిచే విధంగా ఈ సినిమా ఉండదు. గతంలో జరిగిన అనేక సంఘటనలను ఈ సినిమాలో కనిపిస్తాయి. చాలా మంది కొత్త నటులు ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నారు. బెజవాడ నేపధ్యంలో వచ్చిన అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. అలాగే దేవినేని సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. వంగవీటి రంగా గారి పాత్ర పోషించడం నా పూర్వజన్మ సుకృతంగా బావిస్తున్నాను. రంగా గారూ మన దేశానికి స్వాతంత్రం రావడానికి కొద్ది రోజుల ముందు …1947 జూలై 4వ తేదీన జన్మించారు. బహుశా అందుకే ఆయన స్వతంత్రభావాలతో పెరిగారని భావిస్తాను. ఈ పాత్ర ద్వారా నేను ఆయనకు సరైన రీతిలో నివాళులు అర్పించానని భావిస్తున్నాను. నా నట జీవితంలో ఇదో మరపురాని పాత్రగా మిగిలిపోతుంది… అని సురేష్ కొండేటి తెలిపారు.