పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బుధవారం నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కూలిపోవడం నిర్లక్ష్యపు పాలనకు నిదర్శనమని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దేవా గౌడ్ తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అధికారులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు. భద్రాచలం గ్రామ పంచాయతీ, సారపాక గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారిగా ఉన్న ఐటీడీఏ పీఓ ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం: భవన నిర్మాణ సమయంలో స్థానిక ప్రజలు అనుమతుల లేమి, భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై పలు మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని దేవా గౌడ్ విమర్శించారు. ప్రమాదం జరిగిన తర్వాత హుటాహుటిన యంత్రాంగం స్పందించడం పరిపాటిగా మారిందని, దీనికి ఐటీడీఏ పీఓ, గ్రామ పంచాయతీ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జనసేన భవన కూలిపోవడంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇకనైనా భద్రాచలం, సారపాక ప్రాంతాల్లో బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలను అరికట్టాలని, ఇప్పటికే అక్రమంగా నిర్మించిన భవనాలను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని కోరారు.

Share this content:
Post Comment