గర్భిణీలలో రక్తహీనత లేకుండా చర్యలు చేపట్టాలి!

  • ప్రసవ సమయంలో రక్తం కోసం కుటుంబ సభ్యుల అన్వేషణ
  • రక్తం కోసం సోషల్ మీడియాలో పలువురి అభ్యర్థనలు
  • వైయస్సార్ సంపూర్ణ, వైయస్సార్ ప్లస్ కార్యక్రమాలు పక్కాగా వినియోగమవ్వాలి
  • వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రక్తహీనతకు సరిపడా మందులు, పర్యవేక్షణ ఉండాలి
  • లోపాలు గుర్తించి చర్యలు చేపట్టాలి
  • గిరిజన గర్భిణీ స్త్రీలలో అధికంగా రక్తహీనత
  • రక్త గ్రహీతకు, రక్తదాతలకు మధ్య చక్కని ప్రణాళిక రచించాలి
  • మాతా శిశు మరణాలు లేకుండా చూడాలని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: గర్భిణీ స్త్రీలు రక్తహీనతకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. మంగళవారం జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, తామరకండి తేజ, కర్రి మణికంఠ, పైలరాజు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం పార్వతిపురం జిల్లాలో గర్భిణీ స్త్రీలలో అధికంగా రక్తహీనత కనిపిస్తోందన్నారు. ప్రతిరోజు ప్రసవ సమయంలో కుటుంబ సభ్యులు రక్తం కోసం అన్వేషించడం పరిపాటిగా మారిందన్నారు. వాట్సాప్ గ్రూపులలో రక్తదాతల కోసం అభ్యర్థన ప్రతిరోజు కనిపిస్తోందన్నారు. జిల్లా ఆసుపత్రి తో పాటు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవం కోసం జాయిన్ అయ్యే గర్భిణీలలో అధికమందికి రక్తం అవసరం పడుతుందన్నారు. దీనికి రక్తహీనతే కారణమన్నారు. నిరక్షరాస్యులు, నిరుపేదలు అవగాహన లేమితో రక్తహీనతకు లోనవుతున్నారన్నారు. అలాగే రక్తం అవసరమయ్యే వారికి రక్తాన్ని దానం చేసే దాతలు అందుబాటులో ఉండే విధంగా సంబంధిత అధికారులు ఓ ప్రత్యేక ప్రణాళిక రచించాలన్నారు. ఎందుకంటే ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన వారికి రక్తం తెచ్చుకోండి అని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో అవగాహన లేనివారు, నిరక్షరాస్యల కుటుంబ సభ్యులు దాతలను ఎలా సంప్రదించాలో రక్తం ఎలా దొరుకుతుందోనన్న ఆవేదనతో అధికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండానే సంబంధిత శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరారు. అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలలో రక్తహీనత లేకుండా ఉండేందుకు అమలు చేస్తున్న వైయస్సార్ సంపూర్ణ, వైయస్సార్ ప్లస్ తదితర పథకాలు పక్కాగా వినియోగమయేలా పర్యవేక్షించాలన్నారు. అలాగే వైద్యారోగ్య శాఖ ద్వారా గర్భిణీ స్త్రీలకు రక్తహీనతకు గురికాకుండా ఉండేందుకు అవసరమైన మందులు క్రమం తప్పకుండా అందేలా, వారు వాటిని వాడేలా చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణీ స్త్రీలు కుటుంబ సభ్యులకు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. అధికంగా జిల్లాలో గిరిజన గర్భిణీ స్త్రీలు రక్తహీనతకు లోన అవుతున్నారన్నారు. వీరిపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం అన్నారు. అలాగే మాత, శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. డోలీల మోతలు, 108 లో ప్రసవాలు, విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాలకు రిఫెరల్ లేకుండా సంబంధిత శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనికి జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేసి గర్భిణీ స్త్రీలలో రక్తహీనత లేకుండా చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు కోరారు.