నటుడు ఉత్తేజ్‌ భార్య కన్నుమూత

ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా పద్మావతి క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ఆమె తుదిశ్వాస విడిచారు. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉత్తేజ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సినీ ప్రముఖులు, సహనటీనటులు సంతాపం తెలుపుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్‌ చిరంజీవి, ప్రకాశ్‌ రాజ్‌, జీవిత రాశేఖర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉత్తేజ్‌ను పరామర్శించారు.