అడ్డగోలు ఒప్పందంతో అదనపు భారం

*కాలం పాతికేళ్లు….వృధా వ్యయం రూ.21250 కోట్లు
*విద్యుత్తు కొనుగోళ్లలో జగన్ సర్కారు తీరు

లాభం- నష్టం… ఎవరు ఏ పనిచేసినా, వాటి లెక్కవేస్తారు. ఎక్కువ లాభం రావాలని ఆశిస్తారు. తిరుగుడు పడితే తక్కువ నష్టం వచ్చేలా చూసుకుంటారు. వ్యక్తి, కుటుంబం, ప్రభుత్వం ఏ వ్యవస్థకైనా ఇదే వర్తిస్తుంది. తెలివిమాలి, గాడితప్పి, బొక్క బోర్లాపడితే? సకల కష్టనష్టాల ఊబిలోకి ఉన్నపళంగా దిగబడినట్లే. అప్పుల పాలై, నవ్వుల పాలై, భ్రష్టుపట్టి పాతాళం అంచుల్లోకి చేరినట్లే! ఘనత వహించిన జగన్‌ ప్రభుత్వ అతీగతీ సరిగ్గా ఇదే విధంగా ఉంది. దీన్ని విద్యుత్‌ (ఇంధన) శాఖ నిర్వాకమనాలా, పొరపాటని భావించాలా, అలవాటని పరిగణించాలా, ప్రజల గ్రహపాటని తేల్చేయాలా? ఈ అన్ని రకాల పాట్లకీ మూలమైన ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షాన్ని ఇప్పుడు ఏం చెయ్యాలన్నదే అందరిముందూ ఉన్న ఒకే ఒక ప్రశ్న!

*యూనిట్ కు 50 పైసలు అధికం

భారత సౌర విద్యుత్‌ సంస్థ (సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ‘సెకి’ గత సెప్టెంబరులో ఏపీ సర్కారుకు లేఖ పంపింది. వేరే చోట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామంది. ఆ ప్రకారం అవి యూనిట్‌ కరెంట్‌ను రూ. 2.49కి ఇచ్చేందుకు ముందుకొచ్చాయంది. విద్యుత్‌ సరఫరా మరో మూడేళ్ళలో మొదలవుతుంది కాబట్టి మీరూ (ఏపీ) కలసి రావాలంది. పాతికేళ్లకు సరిపడా మాతో ఒప్పందం చేసుకోండని కోరింది. ఉత్తరం ఇలా అందిందో లేదో, 24 గంటలైనా గడవకముందే జగన్‌ ప్రభుత్వం తెగ తొందరపడిపోయింది. ఎటువంటి ఆలోచనా లేకుండా, పూర్వాపరాలు తెలుసుకోకుండా, ఠపీమని ఒప్పేసుకుంది! ఇంతా చేస్తే మార్కెట్లో సౌర విద్యుత్‌ కనిష్ఠ ధర యూనిట్‌కి ఎంతో తెలుసా? రూ.1.99. అంటే ఇది 50 పైసలు అధికం. ఆ లెక్కన ఏటా సెకి నుంచి ఏపీ కొనబోయే కరెంటు 1700 కోట్ల యూనిట్లు. మొత్తం 25 ఏళ్ళకు లెక్కిస్తే అది 42,500 కోట్ల యూనిట్లు. యూనిట్‌కు అర్థ రూపాయి వంతున భారం భరించడమంటే, ఆ ఖర్చు ఏడాదికి రూ. 850 కోట్లు. 25 సంవత్సరాలకీ ఆ మేర కలిపి లెక్కిస్తే అదంతా రూ.21,250 కోట్ల అత్యధిక భారం!

*గుజరాత్ ను చూసైనా…

మరోవైపు యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.99కి కొనేలా సంబంధిత సంస్థతో గుజరాత్‌ ఒప్పందం చేసుకుంది. జగన్‌ ప్రభుత్వం మాత్రం ముందూ వెనకా చూడకుండా, కనీసం టెండర్లు పిలవకుండా, రివర్స్‌ టెండరింగ్‌ మాటే వినబడకుండా, డబ్బు వృథాకి పాల్పడింది. ఇతర సంస్థలు ఏ రేటుకు కొంటున్నాయో పోల్చి చూసుకోకుండా, ‘అదే సరసమైన ధరకు మాకు ఎందుకు ఇవ్వరు’ అని సెకిని అడగకుండా మన్ను తిన్న పాములా ఉండిపోయింది. రేట్లు ఇకముందు ఇంకా తగ్గుతాయని తెలుసు. అయినా ఎక్కువ మొత్తాలు ఖర్చు చేసేయడానికి ఉబలాటపడటాన్ని తెలివితక్కువ అనాలా? అతి తెలివిగా గ్రహించి ఈసడించుకోవాలా? ఎప్పుడో రెండేళ్ల కిందటి టెండర్లనుబట్టి నిర్ణయించిన ధరలనే మీకూ వర్తింపజేస్తామని సంస్థ సన్నాయి నొక్కులునొక్కితే కళ్లప్పగించి, చెవులు రిక్కించి తల ఊపడమేనా! అసలు ఈ ప్రభుత్వానికి కాస్తయినా బాధ్యత, వివేకం లేవనడానికి ఇదే నిఖార్సయిన ఉదాహరణ. వాస్తవానికి సౌరవిద్యుత్‌ ప్యానెల్స్‌ నిర్మాణ వ్యయం తగ్గుతూ వస్తోంది. అందుకే సౌర విద్యుత్‌ ధరలు కూడా బాగా తగ్గిపోతున్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా, బహిరంగ విపణిలోని పరిస్థితిని చూడకుండా, నామమాత్రంగా మిగిలిపోయిందీ బధిర అంధ ప్రభుత్వం. నిరుడు జనవరిలో సౌర విద్యుత్‌ కొనుగోలుకు టెండర్లు పిలిచింది సెకి. తర్వాత ఈ -రివర్సు వేలం జరిపి, యూనిట్‌ కరెంటును రూ. 2.50కే అందిస్తామంది. మార్చిలో యూనిట్‌ కనిష్ఠ ధర రూ. 2.36. జులైలోనూ పరిణామాల కారణంగా, రేటు రెండు రూపాయలతో ఆగింది. అటువంటప్పుడు, ఎక్కువకు కొనాలని జగన్‌ మార్కు పాలన సిద్ధమైపోవడమే మహా విడ్డూరం. సౌర విద్యుత్‌ ధర యూనిట్‌కి రూపాయిన్నరకు తగ్గవచ్చని అంచనాలున్నా, తోసిరాజనేలా ప్రభుత్వం వ్యవహరించడం పరమ దారుణం. ‘టెండర్లు పిలవరెందుకు… రివర్సు టెండరింగ్‌కి వెళ్ళి ధరను ఇంకా ఎందుకు తగ్గించుకోరు’ అని ఇంధన శాఖను అడిగితే ‘నిర్ణయం రాష్ట్రప్రభుత్వానిది’ అంటూ కార్యదర్శి హోదా వ్యక్తి గుంభనంగా చెప్పి తప్పించుకున్నారు. ఈ తరహా పరిణామాలన్నీ జగన్‌ ‘పాలనా సరళి’కి అద్దం పట్టడం లేదూ? ఇక ఈ రాష్ట్రానికి మంచిరోజులు ఎప్పుడు?