300 మంది కరోనా రోగుల దాహాన్ని తీర్చిన అడివి శేష్..

కరోనా సెకండ్ వేవ్ దేశంలో తన ఉదృతిని కొనసాగిస్తోంది. దీంతో రోజు రోజుకీ కోవిడ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక సోషల్ మీడియాలో కరోనా బాధితుల అవస్థలకు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే భాషతో సంబంధం లేకుండా నటీనటులు కరోనా రోగులకు సహయానికి ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ కరోనా బాధితులను అందుకోవడానికి ముందుకు వచ్చాడు. దాదాపు 300 మంది కరోనా రోగుల దాహార్తిని తీర్చాడు.

హైదరాబాద్‏లోని కోఠీ ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు 300 కోవిడ్ పేషెంట్స్ చికిత్స చేయించుకుంటున్నారు. అయితే అక్కడ తాగునీటికి ఇబ్బందిగా ఉంది. ఈ విషయాన్ని పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ విషయం అడివి శేష్ దృష్టికి చేరింది. కరోనా బాధితులతోపాటు అక్కడి వైద్య సిబ్బంది కూడా నీటి సమస్యతో డీహైడ్రేషన్ కు గురౌతున్నారనే విషయం తెలుసుకున్న అడివి శేష్ వెంటనే 850 లీటర్ల వాటర్ బాటిల్స్ ను హాస్పిటల్ కు పంపారు. అలాగే ఆ ఆసుపత్రికి అవసరాలకు సరిపడా తాగునీటిని సరఫరా చేసేందుకు శాశ్వత ప్రణాళికకు తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు. సమయానికి కరోనా బాధితులను ఆదుకున్న అడివి శేష్ ను అక్కడి వారు అభినందించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలను విజ్ఞప్తి చేశారు. అలాగే సినీ కార్మికులకు కరోనా టీకా ఇవ్వనున్నట్లు గతంలో చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే.