ఒక జిల్లాను దత్తత తీసుకుంటా: సీఎం కేసీఆర్

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అభివృద్ధి, అంశాల వారీగా చేరుకున్న లక్ష్యాలపై సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రగతి భవన్ లో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్లెలు, పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని అన్నారు.

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు 100 శాతం ప్రగతి పథంలో పయనించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని ఆకాంక్షించారు. ఈ క్రమంలో తాను కూడా ఓ జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యాచరణలో ప్రత్యక్షంగా పాల్గొంటానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. స్థానిక సంస్థల సమస్యలను పరిష్కరించే క్రమంలో తక్షణమే కొన్ని నిధులను కేటాయించడానికి జిల్లా అదనపు కలెక్టర్లకు రూ.25 లక్షల వరకు అందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.

కాగా, సీఎం ఆదేశాలతో వెంటనే స్పందించిన ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ సమావేశం ముగిసేలోపు సంబంధిత జీవో ప్రతులను అదనపు కలెక్టర్లకు అందించడం విశేషం.