ఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్‌లోకి ఈటల.. రిసార్ట్స్‌లో ఈటల, రేవంత్ రహస్య భేటీ: కేటీఆర్

హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఓ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానమిచ్చిన ఆయన  చేతనైతే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు.

రెండు జాతీయ పార్టీలకు రెండు కోతులు అధ్యక్షులయ్యాయని, ఇప్పుడవి ఎగిరెగిరి పడుతున్నాయని ఎద్దేవా చేశారు. నిజానికి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి కాదని, కాంగ్రెస్-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అని ఆరోపించారు. చీకటి ఒప్పందాలతో ఈ రెండు పార్టీలు పనిచేస్తాయని మండిపడ్డారు. గోల్కండ రిసార్టులో ఈటల, రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని, ఏడాదిన్నర తర్వాత ఈటల చేరేది కాంగ్రెస్ గూటికేనని అన్నారు.

ఈ మధ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, షర్మిల అని పుట్టుకొచ్చారని, వారు కేసీఆర్‌పై మాట్లాడతారు కానీ బీజేపీని పల్లెత్తి ఒక్క మాట కూడా అనరని కేటీఆర్ అన్నారు. వారి టార్గెట్ కేసీఆర్ మాత్రమేనని, ఓటు బ్యాంకు చీల్చేందుకు పన్నిన జాతీయ పార్టీ పన్నాగంలో వీరంతా పావులని అన్నారు. షర్మిల హుజూరాబాద్‌లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అనేది ఓ లక్ష్యంతో పుట్టిన పార్టీ అని స్పష్టం చేశారు.  

రాజాసింగ్ అపాయింట్‌మెంట్ అడిగితే ఇచ్చానని ఆ మాత్రానికే తామిద్దరం దోస్తులైపోతామా? అని ప్రశ్నించారు. అలాగే, ప్రధానమంత్రినో, హోంమంత్రినో కేసీఆర్ కలిస్తే దానికి దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు నమోదైన వారంతా బీజేపీలోకి పరుగులు పెడుతున్నారని, తప్పు చేసినవారందరికీ బీజేపీ షెల్టర్‌గా మారిందన్నారు. ఇటీవల ఓ జర్నలిస్టు తప్పుడు పనులు చేస్తే పోలీసులు కేసులు పెట్టారని, ఆయనేమో బీజేపీ శరణు వేడుకుంటున్నారని తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు.