యూట్యూబర్‌పై అక్షయ్ కుమార్ పరువునష్టం దావా

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ ఓ యూట్యూబర్‌కు రూ.500 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఎఫ్ఎఫ్ న్యూస్ అనే యూట్యూబ్ చానల్‌లో తనపై అసత్య వార్తలు ప్రసారం చేసినందుకుగాను భేషరతు క్షమాపణలు చెప్పాలని లేనట్లయితే రూ.500 కోట్లు కట్టాలని పరువునష్టం నోటీసు పంపించారు. బిహార్‌కు చెందిన రషీద్‌ సిద్దిఖీ అనే వ్యక్తి ఎఫ్‌ఎఫ్‌ న్యూస్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించి.. సుశాత్‌సింగ్ రాజ్‌పుత్ హత్య కేసులో అక్షయ్ కుమార్ ప్రమేయం ఉందని.. సుశాంత్‌సింగ్‌ మృతికి సంబంధించి ఎన్నో అసత్య కథనాలు పోస్ట్‌ చేశాడు.

భారీ బడ్జెట్ చిత్రాల్లో సుశాంత్‌కు అవకాశాలు రావడం అక్షయ్‌కి నచ్చలేదని.. రియా చక్రవర్తి కెనడా పారిపోవడానికి అక్షయ్‌ సాయం చేశాడని పేర్కొంటూ పలు వీడియోలను నెట్టింట్లో పోస్ట్‌ చేసి.. రషీద్‌ డబ్బులు సంపాదించాడు. దీంతో రషీద్‌ సిద్దిఖీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అసత్య ప్రచారాలు చేయడం వల్ల తాను నాలుగు నెలల్లో రూ.15 లక్షలు సంపాదించినట్లు వెల్లడించాడని పలు వార్తా పత్రికల్లో కథనాలు ప్రచూరితమయ్యాయి. కాగా, రషీద్‌ గురించి తెలుసుకున్న అక్షయ్‌ తాజాగా అతనిపై స్థానిక కోర్టులో భారీ మొత్తంలో పరువు నష్టం దావా వేశారు.