ఏకేయూ మూడవ సెమిస్టర్ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

  • ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించిన విసి, రిజిస్ట్రార్, సి.ఈ, ఏ.సి.ఈ తదితరులు

ఆంద్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు నవంబర్ – 2024లో నిర్వహించిన రెండో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఏ.కే.యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు తదితరులు శనివారం లాంఛనంగా విడుదల చేశారు. ఆయా కళాశాలల నుంచి మొత్తం 6807 మంది విద్యార్థులు నమోదు కాగా, 6019 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2780 మంది విద్యార్థులు 46.19 శాతం మేరకు ఉత్తీర్ణత సాధించినట్లు వి.సి.ప్రొఫెసర్ మూర్తి విలేఖరులకు తెలిపారు. బి.ఏ హానర్స్ విభాగంలో మొత్తం 321 మందికి 141మంది, బి.కాం కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగంలో 2253 మందికి 1106 మంది, బి.కాం జనరల్ విభాగంలో 79 మందికి 25 మంది, బి.వొకేషనల్ విభాగంలో 31 మందికి నలుగురు, బి.ఎస్సీ హనర్స్ విభాగంలో 2498 మందికి 1033 మంది, బి.బి.ఏ. విభాగంలో 66 మందికి 35 మంది, బి.సి.ఏ విభాగంలో 771 మందికి 436 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏ.కే.యూ అదనపు పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ అంచుల భారతీ దేవి విలేఖర్లకు తెలిపారు. ఈ ఫలితాలను యూనివర్శిటీ రిజల్ట్స్ లింకు ద్వారా తెలుసుకోవచ్చునని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా వి.సి.ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం మూడో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేయడం జరిగిందని, భవిష్యత్ లో విద్యార్థులు ఇంకా మంచి ఫలితాలను సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో బాటు అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను వి.సి ప్రొఫెసర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సి.ఈ.డాక్టర్ కే.వి.ఎన్.రాజు, ఏ.సి.ఈ. డాక్టర్ ఏ.భారతీ దేవి బాటు పరీక్షా విభాగం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Share this content:

Post Comment