కాంట్రాక్టులన్నీ సాయిరెడ్డి అల్లుడికే

రాష్ట్రంలో కీల‌క ప్రాజెక్టులు అన్నీ వైసీపీలో కీల‌కంగా ఉన్న ఎంపీ, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి అల్లుడు ఉన్న కంపెనీల‌కే ద‌క్కుతుండ‌డం రాజ‌కీయంగా విమ‌ర్శ‌లకు దారితీస్తోంది. అరబిందో కంపెనీలో సాయిరెడ్డి అల్లుడు కీల‌క పాత్ర‌పోషిస్తున్నారు.

అయితే ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌లు ప్రాజెక్టులు, గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన ప్రాజెక్టులు కూడా ఇప్పుడు అర‌బిందో ఖాతాలోకే చేరుతున్నాయి. దీంతో అస‌లు తెర‌వెనుక ఏం జ‌రుగుతోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిలో కీల‌క‌మైన ప్రాజెక్టు విశాఖ స‌మీపంలోని భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం అభివృద్ధి.  ప్రతిపక్షంలో ఉండగా ఈ విమానాశ్రయంపై వైసీపీ నాయ‌కులు తీవ్ర విమర్శలు చేశారు. చంద్ర‌బాబు, ఆయ‌న ప‌రివారం ఈ విమానాశ్ర‌యం నుంచి దోచేశార‌ని కూడా నాయ‌కులు విమ‌ర్శ‌లు సంధించారు. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ మ‌ళ్లీ జీఎంఆర్ కే ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టును అప్పగించారు.  అయితే కొద్ది రోజుల వ్యవధిలోనే జీఎంఆర్ చేతిలో ఉన్న కాకినాడ ఎస్ఈజెడ్ లో మెజారిటీ వాటాలు (51 శాతం)  అరబిందో రాయాల్టీ దక్కించుకుంది.  రైతుల దగ్గర నుంచి భూములు, ప్రభుత్వం నుంచి ఎన్నో రాయితీలు దక్కించుకున్న జీఎంఆర్ సంస్థ ఎంచక్కా 2600 కోట్ల రూపాయలకు ఈ వాటాను అమ్ముకుని వెళ్లిపోయింది.

ఇక‌, ఏపీకి బల్క్ డ్రగ్ పార్కు కేటాయిస్తే అది కూడా అరబిందో చేతికే వెళుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే కెఎస్ఈజెడ్ పై కన్నేశారని చెబుతున్నారు. ఈ పార్కు రాష్ట్రానికి వస్తే మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం వెయ్యి కోట్ల రూపాయాల మేర కేటాయించే అవకాశం ఉంది. మ‌రోవైపు కాకినాడలోని సీపోర్ట్స్ లిమిటెడ్ లో అరబిందో రియాల్టీకి 41.12 శాతం వాటా బదిలీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇది కూడా సాయిరెడ్డి అల్లుడికి చెందిన సంస్థ‌కే ద‌క్కేలా చేస్తారా ? అన్న విమ‌ర్శ‌లు ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే సాయిరెడ్డి ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు బాగా టార్గెట్ అవుతున్నారు. ఇప్పుడు కూడా ఆయ‌న టార్గెట్‌గా విమ‌ర్శ‌లు పెరిగేలా ప‌నులు ఉన్నా స‌ర్కారు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌క‌పోగా. త‌న ప‌ట్టుద‌ల‌ను మాత్రం కొన‌సాగిస్తుండ‌డం విశేషం.