పరీక్షలు లేకుండానే 8వ తరగతి వరకు విద్యార్థులందరూ పాస్.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం!

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో 8వ తరగతి వరకు బడులను మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, 8వ తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పాస్ చేయించాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయంలో రెండు, మూడు రోజుల్లోనే స్పష్టమైన ప్రకటన చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.

గత నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో 9,10 తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యక్ష బోధనకు అనుమతి నిచ్చింది. అదే నెల 24వ తేదీ నుంచి 6 నుంచి 8 తరగతుల వరకు ప్రత్యక్ష బోధనకు అనుమతి నిచ్చిన ప్రభుత్వం ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. స్కూళ్లు, గురుకులాలు తెరిచిన తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

 8వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని, వారిని ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, 9, 10 తరగతులకు మాత్రం ప్రత్యక్ష బోధనను కొనసాగించాలని, లేదంటే బోర్డు పరీక్షలు వారికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికితోడు పదో తరగతి పరీక్షల తేదీలను ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తల మధ్య వారికి ప్రత్యక్ష బోధన కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.