ఆంధ్రుల ఓట్లతో గెలిచిన పార్లమెంటు సభ్యులారా విశాఖ ఉక్కు కోసం గళం విప్పండి

• ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడండి
• ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకోండి
• విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు
• ప్రైవేటీకణ ఆపేందుకు వైసీపీ కలసి రావాలి
• అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలి
• రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో కలసేందుకైనా జనసేన సిద్ధం
• తమిళనాడు థియరీని అమలు చేయండి
• జనసేన అమరావతి అధికార ప్రతినిధి శ్రీ మండలి రాజేష్ డిమాండ్

ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభ, రాజ్యసభలకు ఎన్నికయిన పార్లమెంటు సభ్యులు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పార్టీలకు అతీతంగా గొంతెత్తాలని జనసేన పార్టీ అమరావతి అధికార ప్రతినిధి శ్రీ మండలి రాజేష్ స్పష్టం చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడితో పాటు వైసీపీ, టీడీపీ ఎంపీల మీద కూడా ఉందన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పార్టీ శ్రేణులతో కలసి విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో శనివారం డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. పార్లమెంటు సభ్యులను ట్యాగ్ చేస్తూ నినదించారు. అనంతరం శ్రీ రాజేష్ మాట్లాడుతూ..
మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా రాజకీయ పార్టీలుగా వైరుధ్యాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి అంతా ఏకమవ్వాలి. పొరుగు రాష్ట్రం తమిళనాడులోని రాజకీయ పార్టీల స్ఫూర్తితో ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు ముందుకు రావాలి. సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం తెరమీదకి తెచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి శ్రీ పళనీస్వామి, అప్పటి ప్రతిపక్ష నేత అయిన నేటి ముఖ్యమంత్రి శ్రీ స్టాలిన్ గారితో కలసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు. అదే థియరీని విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో అమలుపర్చాలి. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం జనసేన పార్టీ ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధంగా ఉంది. ఆ విషయాన్ని స్వయానా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో చెప్పారు కూడా. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపేందుకు వైసీపీ కలసి రావాలి.
డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా మొదట శ్రీ పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ మేరకు రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించాలి. పార్లమెంటులో గళం విప్పాలి. ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకునే అవకాశం మీకు వచ్చింది. జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ఆరంభం మాత్రమే. పార్లమెంటులో మీరు పోరాటం చేయకుంటే మీ మీద జనసేన పోరాటం చేస్తుంది. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల్లో మీరు తిరిగే పరిస్థితి ఉండదు. ప్రజలే మిమ్మల్ని తరిమికొడతారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అఖిలపక్షం ఏర్పాటు చేయండి. బాధ్యత గల ప్రభుత్వంగా ఢిల్లీ తీసుకువెళ్లి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. జనసేన పార్టీ మీతో కలసి పోరాటం చేస్తుంది. అలా చేయని పక్షంలో మిగిలిన రెండున్నరేళ్లు వైసీపీ ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేస్తాం. జై ఆంధ్రా.. జై జనసేన.. జై హింద్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *