ఓటమి భయంతోనే ప్రతిపక్షాలపై వైసీపీ నేతల దాడులు: ఆళ్ళ హరి

  • ప్రజల సమస్యల్ని పరిష్కారించమంటే వైసీపీ నేతలకు ఎక్కడలేని కోపం వస్తుంది
  • చరిత్రహీనులుగా మిగిలిపోనున్న వైసీపీ నాయకులు

గుంటూరు, వైసీపీ నేతలకు ఓటమి కళ్ళముందు కదలాడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో అసహనం, నిరాశా నిస్పృహలకు గురై ప్రతిపక్ష నేతలపై దాడులకు దిగుతున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై వైసీపీ నేతలు చేసిన దాడులను ఆయన శనివారం తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రధానంగా గుంటూరు జిల్లాలో వైసీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని మండిపడ్డారు. తమ దాష్టీకాలను ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నారని ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని రాజధాని కోసం తన భూముల్ని ఇచ్చిన రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నించి ప్రవరిస్తున్న తీరు అత్యంత గర్హనీయం అన్నారు. దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరుకున్న నేపధ్యంలో రైతులకు మద్దతుగా నిలిచిన బీజేపీ రాష్ట్ర నాయకులు సత్యకుమార్ పై వైసీపీ నేతలు దాడి చేయటం పిరికిపంద చర్య అన్నారు. మరోపక్క తెనాలి పురపాలక సంఘం సమావేశంలో 20 వ వార్డు కౌన్సిలర్ దేసు యుగంధర్ పై వైసీపీ కార్పొరేటర్లు మూకుమ్మడిగా దాడి చేయటం దుర్మార్గమన్నారు. ప్రజాధనం వృధా అయ్యేవిధంగా ఉన్న ఏక టెండర్ విధానాన్ని వ్యతిరేకించటమే ఆ కార్పొరేటర్ చేసిన తప్పా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించమన్నా, ప్రజాధనాన్ని దోచుకోవద్దన్నా వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. తమ దాష్టీకాలను ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఉన్న కొద్దిపాటి సమయంలోనైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని లేని పక్షంలో వైసీపీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హితవు పలికారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న ప్రతీ దాడికి ప్రజాస్వామ్య పద్ధతిలోనే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఆళ్ళ హరి వైసీపీ నేతల్ని హెచ్చరించారు.