సంక్రాంతి కి అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు`

‘అల్లరి’ సినిమాతో సినీ ప్రవేశం చేసి అల్లరి నరేష్ గా మారిన ఈవీవీ తనయుడు ఇటీవల హీరోగా సరైన హిట్ లేక వెనకపడిపోయాడు. కామెడీ నేపథ్యంలో పలు సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. అడపా దడపా మధ్యలో పెద్ద హీరోల సినిమాలలో కీలక పాత్రలను పోషిస్తు విమర్శకుల ప్రశంసలు పొందుతున్నాడు. త్వరలో `బంగారు బుల్లోడు` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.వి.గిరి దర్శకుడు. పూజా ఝవేరి కథానాయిక. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలయింది. కాగా ఈ చిత్రం ‘బ్యాంక్‌ నగల అదృశ్యం నేపథ్యంలో నడుస్తుందని తెలుస్తోంది. వినోదం, ప్రేమ, సస్పెన్స్‌, సెంటిమెంట్‌ అంశాలతో రూపొందినట్టు అర్థమవుతోంది. నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా కడుపుబ్బ నవ్వించనున్నారు. తనికెళ్లభరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్‌, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తిక్ సంగీతం అందించారు. కరోనా వలన ఇన్నాళ్ళు థియేటర్‌లోకి రాకుండా ఆగిన ఈ చిత్రం జనవరిలో సినిమా విడుదలకు ప్లాన్ చేశామని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో కామెడీ అభిమానులు పండగ చేసుకోనున్నారు.