రాష్ట్ర ప్ర‌జ‌ల ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోసం కూట‌మి పొత్తు: పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌, రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పడిన కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి అభ్యర్ధి ప్ర‌త్తిపాటి పుల్లారావును గెలిపించాలని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ తెలిపారు. గురువారం ఆయ‌న నివాసంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో అనేక స‌మ‌స్య‌లు అపరిష్కృతంగా ఉన్నాయ‌ని, వాటి ప‌రిష్కారానికి ఉమ్మ‌డి అభ్య‌ర్ధి ప్ర‌త్తిపాటి పుల్లారావు కృషి చేస్తార‌ని తెలిపారు. ఐదేళ్ల కాలంలో నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ఒక్క అభివృద్ది కార్య‌క్ర‌మం కొన‌సాగ‌లేద‌ని, వైసీపీ పాల‌న‌లో ఇసుక‌, మ‌ట్టి, గ్రావెల్ దోపిడి పెరిగి స‌హ‌జ వ‌న‌రులను సైతం దోచుకున్నార‌ని మండిప‌డ్డారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు స‌త్వ‌ర న్యాయం కోసం, ప్ర‌జ‌లకు అందుబాటులో ఉండి, ప్ర‌జాసేవ‌లో నిమ‌గ్న‌మ‌య్య వ్య‌క్తి ప్ర‌త్తిపాటి పుల్లారావు ఉమ్మ‌డి అభ్య‌ర్ధిగా ఉన్నార‌ని, ఆయ‌న విజ‌యం కోసం కూట‌మిలో అన్ని పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌న్నారు. చిల‌క‌లూరిపేట అభివృద్ది ప్ర‌త్తిపాటి పుల్లారావుతోనే సాధ్య‌మౌతుంద‌న్నారు.
అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హించాలి. జనసేన-టీడీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ సామాజిక మాధ్యమాలు వేదికగా చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాల ప‌ట్ల ఆయా పార్టీల నాయ‌కులు, కార్య‌కర్త‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. తెదేపా జనసేన పార్టీ మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, సామాజిక మాద్య‌మాల ద్వారా ప్ర‌చారం అవుతున్న త‌ప్పుడు ప్ర‌చారాల‌ను పార్టీల‌ అధిష్టానం దృష్టికి తీసుకురావాల‌ని కోరారు. జనసేన-టీడీపీ-బీజేపీ పార్టీల ఉమ్మడి లక్ష్యం వైసీపీని గద్దె దించడమేనని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా అడుగులు వేయాలని సూచించారు. యువతకు ఉపాధి, మహిళలకు రక్షణ, రైతుకు సాయం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే అంశాల మీద దృష్టి సారించే విధంగా రానున్న రోజుల్లో మంచి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేద్దామ‌ని పిలుపునిచ్చారు.