గుంటూరు తూర్పుని నేరేళ్ళ సురేష్ కు కేటాయించండి: ఆర్యవైశ్య రాజకీయ జేఏసీ

గుంటూరు, సమాజ సేవకుడు, సౌమ్యుడు గత రెండు దశాబ్దాలుగా ఎంతోమంది అపన్నులకు ఎన్నో గుప్తదానాలు చేసిన గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ కు గుంటూరు తూర్పు నియోజకవర్గ సీటును కేటాయించాలని ఆర్యవైశ్య రాజకీయ జేఏసీ సభ్యులు అమరా శ్రీనివాస్, కొటా సురేష్ కోరారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతోనూ, ఆధ్యాత్మికంగానూ సమాజంపై ఆర్యవైశ్యులు ఎంతో ప్రభావం చూపుతారన్నారు. దేశ స్వతంత్ర పోరాటంలోనూ, ప్రత్యేకాంధ్ర నిర్మాణంలోనూ, దేశ, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆర్యవైశ్యుల పాత్ర చరిత్రలో లిఖించబడిందన్నారు. రాష్ట్రంలో సుమారు 45 లక్షలు ఉన్న ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడంలో అన్ని పార్టీలు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్ధం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు ఎంతో రాజకీయ ప్రాధాన్యం ఉండేదన్నారు. రాష్ట్రం విడిపోయాక మూడు నాలుగు సీట్లు మాత్రమే కేటాయించి ఆర్యవైశ్యులకు రాజకీయంగా పార్టీలు అన్యాయం చేస్తూనే ఉన్నాయని భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు అర్బన్ జిల్లా జనసేన పార్టీ అధినేతగా తమ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నేరేళ్ళ సురేష్ కు కేటాయించటంపై అప్పట్లోనే హర్షం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే సీటును నేరేళ్ళ సురేష్ కు కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కోరారు. ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సామాజిక వర్గంపై అత్యంత ప్రభావితం చేస్తుందని జనసేనకు కొండంత అండగా తామంతా నిలుస్తామని తెలిపారు. తామంతా ఆర్ధిక బలాన్ని, అంగ బలాన్ని అందించి సమాజంలోని అన్నివర్గాల మద్దతుతో నేరేళ్ళ సురేష్ ను గెలిపించి గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇస్తామని అమరా శ్రీనివాస్, కోటా సురేష్ తెలిపారు. పత్రికా సమావేశంలో వాసవి మార్కెట్ అధ్యక్షుడు అచ్యుత శ్రీనివాస్, వైష్ణవి క్లాత్ మార్చంట్ అధ్యక్షుడు వాసుదేవరావు, కొండలరావు, మురళి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.