రఘురామకృష్ణం రాజు తో పాటు ABN, Tv5లపై కేసులు

ఏపీలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ ఎంపీను ప్రభుత్వం అరెస్టు చేయించింది. మరోవైపు రెండు మీడియా ఛానెళ్లపై సీఐడీ కేసులు నమోదు చేసింది.

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు  అరెస్టు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై సీఐడీ వివరణ ఇచ్చింది. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అరెస్టు చేసింది. ఎంపీపై ఎఫ్ఐఆర్ 12/2021 నమోదైంది. ఎంపీతో పాటు ఏబీఎన్, టీవీ 5 ఛానెళ్లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఏ1గా రఘురామకృష్ణం రాజు, ఏ2గా టీవీ5, ఏ3గా ఏబీఎన్ ఛానెల్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా ప్రజల్ని రెచ్చగొట్టేలా చేష్టలున్నాయని సీఐడీ  వెల్లడించింది. కుల, మత వర్గాల్ని టార్గెట్ చేసి టీవీ5(Tv5) , ఏబీఎన్‌తో(ABN) కలిసి రఘురామకృష్ణంరాజు కుట్రలు చేసినట్టు తెలిపింది. ఈ రెండు ఛానెళ్లు ఎంపీ కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించాయని..ప్రభుత్వంపై విషం చిమ్మాయని సీఐడీ పేర్కొంది. పక్కా పథకం ప్రకారమే రఘురామకృష్ణంరాజు ప్రసంగాలు చేశారని సీఐడీ తెలిపింది. అందుకే ఎంపీతో పాటు ఈ రెండు ఛానెళ్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వాన్ని కించపర్చినందుకు CRPC 124(A)సెక్షన్, కుట్రపూరిత నేరానికి పాల్పడినందుకు 120(B)IPC సెక్షన్ కింద, కులాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినందుకు 153(A),CRPC 505 సెక్షన్ కింద సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు.