వైఎస్సార్ జగనన్న కారాగారాలు పథకాన్ని కూడా ప్రవేశపెట్టండి: ఆళ్ళ హరి

గుంటూరు, ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న భూకబ్జాలు, గంజాయి, దౌర్జన్యాలు, అరాచకాల నేపధ్యంతో పాటూ వివిధ నేరాల్లో అభియోగాలు ఎదురుకుంటున్న వైయస్సార్ కుటుంబ సభ్యుల కోసం దశవ రత్నంగా జగనన్న కారాగారాలు అనే పధకాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నేతలు రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ గా మార్చారని మండిపడ్డారు. ఏ టీవీ పెట్టినా పేపర్ చూసినా ఢిల్లీ లిక్కర్ కేసు, బాబాయ్ హత్యకేసు, కోడికత్తి కేసు, వైవీపీ నేతల దుర్మార్గాలు తప్పా మరొక అంశం కనపడటం లేదని విమర్శించారు. ఆర్ధిక, హత్యా రాజకీయ కేసులతో రాష్ట్ర పరువును దేశ స్థాయిలో తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్యకు గురికాబడ్డాడు, మరో బాబాయ్ ఈ హత్యకేసులో జైల్లో ఉన్నాడు, సొంత సోదరుడు ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియదు ఇలాంటి వ్యక్తులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అంటే అది ఈ రాష్ట్ర ప్రజలు ఏనాడో చేసుకున్న పాపం అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా కోడికత్తి కేసులో కోర్టుకి హాజరు కావటానికి ట్రాఫిక్ సమస్య అంటూ కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ నేపధ్యంలో కోర్టు కేసులకు సంభందించి న్యాయవాదులకు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించటం దుర్మార్గమన్నారు. ఎలాంటి వ్యక్తులకు అధికారాన్ని అప్పగిస్తున్నామో, రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెడుతున్నామో ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలన్నారు. డబ్బు పట్ల అధికారం పట్ల వ్యామోహం లేని వ్యక్తి, సమాజం మీద, దేశం మీద బాధ్యత, ప్రేమ ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఒక్కసారి అధికారం ఇవ్వాలని ప్రజల్ని ఆళ్ళ హరి కోరారు.