అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుంది

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అమరావతి పునఃశంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “రాజధానికి భూములు ఇచ్చిన 29,000 మందికిపైగా రైతులు భవిష్యత్తు తరాల కోసం చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి రైతులు అనుభవించిన బాధలు మర్చిపోలేనివి. కానీ, ధర్మయుద్ధంలో వారు విజయం సాధించారు,” అని పేర్కొన్నారు.
“ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం కావడం హర్షించదగ్గ పరిణామం. అమరావతి కాంక్రీట్ జంగిల్ కాకుండా, జవాబుదారీతనం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఎదుగుతుంది,” అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ, “సైబరాబాద్‌ను నిర్మించిన విధంగా అమరావతినీ ప్రపంచస్థాయి మహానగరంగా తీర్చిదిద్దే దిశగా ఆయన కృషి కొనసాగుతుంది,” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. అమరావతి, భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచి, అభివృద్ధికి ప్రతీకగా మారుతుందన్న నమ్మకాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Share this content:

Post Comment