అంబేడ్కర్ గారి ఆశయాలు సదా ఆచరణీయాలు: జనసేనాని

ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి భారతీయుడు – ఆయన జీవన ప్రస్థానాన్ని… రాజ్యాంగ రచనలో ఆయన చేసిన కృషినీ… బడుగు బలహీన నిమ్న వర్గాలకు సమాన అవకాశాల కల్పన కోసం తపించిన విధానాన్ని తప్పనిసరిగా స్మరించుకోవాలి. ‘కులం పునాదులపై ఒక నీతినిగానీ, ఒక జాతినిగానీ నిర్మించలేం’ అని చెప్పి… దేశంలో ఉన్న ప్రజలందరూ సామాజికంగా కలిసి ఉండాలని అంబేడ్కర్ గారు ఆకాంక్షించారు. వర్తమాన సమాజం, నవ యువకులు, భావి భారత పౌరులు మన రాజ్యాంగ నిర్మాత చెప్పిన ఆ మాటల్లో పరమార్థాన్ని తప్పనిసరిగా గ్రహించాలి.

సామాజికంగా అందరూ కలసి ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.. దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు రూపొందించే క్రమంలో అంబేడ్కర్ గారి రచనలు… వారి గురించిన వ్యాసాలు చదివి ప్రభావితం అయ్యాను. వారి ఆశయాలు సదా ఆచరణీయాలు…వాటిని జనసేన బలంగా ముందుకు తీసుకువెళ్తుంది. అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి హృదయపూర్వకంగా నా తరఫున, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.