అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం: గురాన అయ్యలు

విజయనగరం: ప్రపంచ గొప్ప మేధావులలో ఒకరిగా, ప్రపంచానికే స్ఫూర్తిప్రదాతగా నిలిచిన అంబేడ్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టమని జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు, ఆదాడ మోహన్ రావులు పేర్కొన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని జీఎస్ఆర్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం, అందరికీ సమానంగా అందాలని అంబేద్కర్ ప్రవచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను జనసేన పార్టీ తరుపున ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వజ్రపు నవీన్ కుమార్, ఎంటి రాజేష్, ఎమ్. పవన్ కుమార్, మాదువలస శ్రీను, సీహెచ్ కృష్ణ ప్రసాద్,
కె. బంగారు నాయుడు, పుథ్వీ భార్గవ్, యడ్ల బాష తదితరులు పాల్గొన్నారు.