ముగిసిన అమిత్ షా రోడ్‌ షో.. పెద్ద ఎత్తున పాల్గొన్న బీజేపీ నేతలు, కార్యకర్తలు..

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యేక విమానంలో బేగంపేటకు వచ్చిన ఆయనకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుండి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్న అమిత్‌ షాకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమిత్‌ షా. ఆ తరువాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్‌ మండి హనుమాన్‌ టెంపుల్‌ వరకు అమిత్ షా రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షోలో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అటు షా రాకతో నగరమంతా కాషామయం అయ్యింది.

అయితే అమిత్ షా రోడ్ షో మధ్యలోనే ముగిసింది. వారాసిగూడ నుంచి రోడ్ షో ప్రారంభించిన ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు. సమయాభావంతోనే అమిత్ షా ఎలాంటి ప్రసంగం లేకుండానే రోడ్ షోకి ముగింపు పలికినట్లు తెలుస్తోంది. అయితే కవాడిగూడ నుంచి బీజేపీ ఆఫీస్‌కు వెళ్లారు అమిత్ షా. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశమై తిరిగి సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు.

హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్ షా తెలంగాణ ప్రజల ఆప్యాయత గురించి తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ”హైదరాబాద్ చేరుకున్నాను. తెలంగాణ ప్రజల ఆప్యాయతకు మరియు మద్దతుకు ముగ్దుడనైయ్యాను.” అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం,  ‘అమ్మవారి తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్ధించాను’ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు