వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆనంద్ దేవరకొండ!

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. కలవారి అమ్మాయిని ఓ పేద కుర్రాడు కన్నెత్తి చూస్తే ఏమవుతుందనే కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో ఆయన చాలా బాగా నటించాడు. ఆ తరువాత కూడా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథగా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చేశాడు. ఇక ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘పుష్పక విమానం’ సిద్ధంగా ఉంది. థియేటర్లలోనే ఈ సినిమాను వదలాలనే ఆలోచనలో ఉన్నారు.

ఆ తరువాత ఆనంద్ దేవరకొండ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు. ‘118’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కేవీ గుహన్ దర్శకత్వంలో ‘హైవే’ చేయనున్నాడు. ‘కలర్ ఫోటో’ సినిమాకి కథను అందించిన సాయి రాజేశ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో .. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో .. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఒక్కో సినిమాను చేయనున్నాడు. ఇవన్నీ కూడా ఒకదాని తరువాత ఒకటి సెట్స్ పైకి వెళ్లనున్నాయి .. అదే క్రమంలో థియేటర్స్ లో దిగనున్నాయి.