ఎమ్మెల్యే కాకానితో కలిసి కృష్ణపట్నం చేరుకున్న ఆనందయ్య

ఆనందయ్య కరోనా మందుకు ప్రభుత్వం, హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆనందయ్య తన స్వస్థలం కృష్ణపట్నం చేరుకున్నారు. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి కృష్ణపట్నానికి వచ్చిన ఆయనకు స్థానికులు దిష్టి తీశారు. అనంతరం తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులతో చర్చించిన మీదట మందు పంపిణీ ప్రారంభిస్తానని, త్వరలోనే తేదీ ప్రకటిస్తానని వెల్లడించారు.

మొదట ఔషధానికి అవసరమయ్యే వనమూలికలు సమకూర్చుకోవాల్సి ఉందని, ఆపై ఔషధం తయారీకి 3 రోజుల సమయం పడుతుందని ఆనందయ్య వివరించారు. ఎమ్మెల్యే కాకాని సర్వేపల్లి నియోజకవర్గంలో అందరికీ మందు ఇవ్వాలని కోరారని, ముందు ఆ పని చూస్తానని ఆనందయ్య తెలిపారు.