‘ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ సేవ’ యాప్‌

ఏపీ ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ సంచలనం నిర్ణయాలతో, సరికొత్త విధానాలతో ముందుకు వెళుతోంది. పరిపాలనా సంస్కరణలు తీసుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ శాఖలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ కొత్త యాప్ ను రూపొందించింది. దేశంలోనే తొలిసారిగా సరికొత్తగా రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ సేవ’ యాప్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సియం జగన్ ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండానే ప్రజలకు 87 రకాల సేవలు ఈ యాప్‌ ద్వారా అందనున్నాయి. పోలీస్‌స్టేషన్‌ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందే అవకాశం కల్పించారు. అన్ని నేరాలపై ఫిర్యాదులు చేయడమే కాకుండా వాటికి రసీదు సైతం లభించేలా యాప్‌ను తీర్చిదిద్దారు. యాప్‌ పని చేసే విధానాన్ని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. సిటిజన్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా యాప్‌ను తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించిన 12 మాడ్యూల్స్‌ను ఇందులో చేర్చామన్నారు.